
UPI Payments: ప్రభుత్వం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) లావాదేవీలపై కొత్త నిబంధనలను విడుదల చేసింది. సెప్టెంబర్ 14, 2026న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం, 2,000 వరకు ఉన్న యూపీఐ లావాదేవీలపై బ్యాంకులు , పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్లు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకూడదు.
ఈ నిబంధన చెల్లింపు చేసేవారికి , అందుకునే వారికి రెండు వైపులా వర్తిస్తుంది. ఇది 2007 పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ చట్టంలోని సెక్షన్ 10ఏ సవరణ తర్వాత వచ్చిన మొదటి నోటిఫికేషన్. గతంలో అన్ని యూపీఐ లావాదేవీలపై జీరో ఎండీఆర్ (మర్చంట్ డిస్కౌంట్ రేట్) వర్తించేది. ఇప్పుడు ప్రభుత్వం ఏ ఏలక్ట్రానిక్ పేమెంట్ మోడ్‌లపై ఛార్జీలు ఉండకూడదని నిర్ణయించుకునే అధికారం కలిగి ఉంది.
అక్టోబర్ 15 నుంచి ఎంపిక చేసిన పర్సన్-టు-మర్చంట్ (P2M) UPI లావాదేవీలపై ప్రభుత్వం మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR)ను అమలు చేయబోతోంది. దీని ప్రకారం, రూ. 2000 పైబడిన లావాదేవీలపై వ్యాపారులు 0.4% రుసుము చెల్లించాల్సి ఉంటుంది. రూ. 75,000 లేదా అంతకంటే ఎక్కువ చెల్లింపులపై గరిష్ట రుసుము రూ. 300గా ఉంటుంది. ఈ విషయమై ప్రభుత్వం సోమవారం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఈ నోటిఫికేషన్ వెలువడినప్పటి నుండి రూ. 2000 పైబడిన లావాదేవీలపై ఛార్జీ విధించవచ్చని ఊహాగానాలు మొదలయ్యాయి.
కేంద్రం విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా 2,000 వరకు యూపీఐ లావాదేవీలు పూర్తిగా ఉచితంగా ఉంటాయి. రూపే డెబిట్ కార్డు చెల్లింపులు మొత్తం ఉచితంగా ఉంటాయి. వ్యక్తి నుంచి వ్యక్తికి (పీ2పీ) యూపీఐ బదిలీలు ఉచితంగా కొనసాగనున్నాయి.
ఇది వినియోగదారులపై కాకుండా వ్యాపారులపైనే ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం యూపీఐ లావాదేవీల్లో సుమారు 96 శాతం 2,000 లోపు ఉన్నాయి. అందుకే అత్యధిక మంది వినియోగదారులకు ఎలాంటి మార్పు ఉండదు. ప్రభుత్వం ఈ చర్యను డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను సుస్థిరంగా ఉంచడానికి తీసుకున్న నిర్ణయంగా అభివర్ణిస్తోంది. వినియోగదారులపై ఎలాంటి భారం పడకుండా, బ్యాంకులు, పేమెంట్ కంపెనీలు మౌలిక సదుపాయాలు, సైబర్ సెక్యూరిటీపై పెట్టుబడి పెట్టే అవకాశం కల్పించడమే లక్ష్యమని అధికారులు తెలిపారు.