పీఎఫ్ ఖాతాదారులకు ప్రతినెలా పెన్షన్ వస్తుంది. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ వో) ఆధ్వర్యంలో వీటి నిర్వహణ జరుగుతుంది. ఈపీఎఫ్ ఖాతాలను సమర్థంగా నిర్వహించేలా ఈపీఎఫ్ వోకు కేంద్రం ఇటీవల కీలక ఆదేశాలు జారీ చేసింది. పీఎఫ్ పథకంలో ఖాతాదారులందరూ తమ యూనివర్సల్ అకౌంట్ నంబర్ల (యూఏఎన్)ను ఆధార్ ఆధారిటీ ఓటీపీ వ్యవస్థ ద్వారా యాక్టివేట్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దీని అమలుకు ఆయా యాజమాన్యాలతో కలిసి పనిచేయాలని ఈపీఎఫ్ వోకు ఆదేశించింది. 2024-25 యూనియన్ బడ్జెట్ లో ప్రభుత్వం ప్రకటించిన ఎంప్లాయిమెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ (ఈఎల్ఐ) పథకంలో అమల్లో భాగంగా ఈ చర్యలు చేపట్టింది. కేంద్రం ఆదేశాలను సమర్థవంతంగా అమలు చేయడం కోసం జోనల్, ప్రాంతీయ ఈపీఎఫ్ వో కార్యాలయాలు కూడా రంగంలోకి దిగాయి.
యూఎన్ఏ యాక్టివేషన్ తో ఉద్యోగులు తమ ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ఖాతాలను మెరుగ్గా నిర్వహించుకునే వీలుంటుంది. అన్నిప్రయోజనాలను పొందటానికి అవకాశం కలుగుతుంది. దీని ద్వారా పాస్ బుక్ లను తనిఖీ చేసుకోవడం, డౌన్ లోడ్ చేయడం, నగదు ఉపసంహకరణ, బదిలీలకు క్లెయిమ్ చేసుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది. వ్యక్తిగత సమాచారాన్ని కూడా ఆన్ లైన్ లో అప్ డేట్ చేసుకోవచ్చు. దీని ద్వారా వివిధ పనులపై పీఎఫ్ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం ఉండదు.
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు యాజమాన్యాలు ఈ ఏడాది నవంబర్ 30 నాటికి కొత్త ఉద్యోగులకు ఆధార్ ఆధారిత ఓటీపీ ద్వారా యూఏఎన్ ను యాక్టివేట్ చేయాలి. ఆ తర్వాత మిగిలిన ఉద్యోగులందరికీ ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. ఆధార్ చెల్లింపు వ్యవస్థ ద్వారానే అన్నిసంక్షేమ పథకాలను లబ్ధిదారుడికి అందించే క్రమంలో వందశాతం బయో మెట్రిక్ ప్రామాణీకరణను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. పీఎఫ్ చందాదారులందరికీ తమ ఖాతాకు సంబంధించిన ఓ నంబర్ ఉంటుంది. దీన్నే యూఏఎన్ అంటారు. దీనిలో 12 అంకెలు ఉంటాయి. ఖాతాదారుడి లావాదేవీలన్నీ దాని మీదుగా జరుగుతాయి. ఉద్యోగస్తుడు వేరే కంపెనీకి వెళ్లినప్పటికీ ఈ నంబర్ మారదు. ఎక్కడ పనిచేసినా, ఎన్ని ఉద్యోగాలు మారినా దీన్ని కొనసాగించవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..