Telugu News Business Travel 501 km on a single charge, This Ola electric bike has a different range, Ola roadstar details in telugu
Ola roadstar: సింగిల్ చార్జింగ్ పై 501 కిలోమీటర్ల ప్రయాణం.. ఈ ఓలా ఎలక్ట్రిక్ బైక్ రేంజే వేరు
ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్ లో ఓలా కంపెనీ ప్రత్యేక గుర్తింపును సంపాదించింది. అనేక రకాల మోడళ్లను విడుదల చూస్తూ కస్టమర్లకు బాగా దగ్గరైంది. లేటెస్ట్ టెక్నాలజీతో, ఆకట్టుకునే లుక్ తో, అందుబాటులో ధరలో వాహనాలు అందించడం ఈ కంపెనీ ప్రత్యేకత. సాధారణంగా ఎలక్ట్రిక్ విభాగంలో స్కూటర్లు అధికంగా విడుదలవుతున్నాయి. అయితే బైక్ లు కావాలనే కోరుకునే వారికి కొంచె నిరాశే ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో అలాంటి వారి కోసం రోడ్ స్టర్ పేరుతో ఎలక్ట్రిక్ బైక్ లను ఓలా విడుదల చేసింది. వాటి ప్రత్యేకతలు, ధర వివరాలను తెలుసుకుందాం.
ఓలా కంపెనీ నుంచి రోడ్ స్టర్ ఎక్స్, రోడ్ స్టర్ ఎక్స్ ప్లస్ అనే పేర్లతో ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లు విడుదలయ్యాయి. ఈ రెండు వాహనాలు మంచి లుక్ తో ఆకట్టుకుంటున్నాయి. ఇవి వేర్వేరు బ్యాటరీ ప్యాక్ లలో లభ్యమవుతున్నాయి. వీటి ప్రారంభ ధరను రూ.89,999గా నిర్ణయించారు. ఇప్పటికే బుక్కింగ్ లు మొదలు కాగా, వచ్చే నెల నుంచి డెలివరీలు ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవ ఆఫర్ గా ప్రతి వాహనంపై రూ.15 వేల తగ్గింపును ఓలా ప్రకటించింది. ఈ కథనంలో తెలిపిన ధరకంటే రూ.15 వేలకు తక్కువగా కొనుగోలు చేయవచ్చు.
రోడ్ స్టర్ ఎక్స్
ఓలా రోడ్ స్టర్ ఎక్స్ మోడల్ మూడు రకాల బ్యాటరీ ప్యాక్ లలో లభిస్తోంది. వీటిలో 2.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో వచ్చే బేస్ వేరియంట్ ధరను రూ.89,999గా నిర్ణయించారు. పూర్తి సింగిల్ చార్జింగ్ తో దాదాపు 144 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు. గంటకు 105 కిలోమీటర్ల గరిష్ట వేగంతో పరుగులు తీస్తుంది.
3.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ కలిగిన వేరియంట్ రూ.99,999కు అందుబాటులో ఉంది. దీని టాప్ స్పీడ్ గంటకు 125 కిలోమీటర్లు. సింగిల్ చార్జింగ్ తో గరిష్టంగా 201 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.
4.5 కేడబ్ల్యూహెచ్ వేరియంట్ ధర రూ.1,19,999 పలుకుతోంది. సింగిల్ చార్జింగ్ తో 259 కిలోమీటర్లు పరుగులు తీస్తుంది. గంటకు 125 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణం చేయవచ్చు.
ఈ మూడు వేరియంట్లు ఓలా మూవ్ ఓఎస్5తో పనిచేస్తాయి. వీటిలో 4.3 అంగుళాల ఎల్సీడీ స్క్రీన్ అమర్చారు. స్పోర్ట్స్, నార్మల్, ఎకో అనే మూడు మోడళ్లు ఉన్నాయి. ఏబీఎస్, డిస్క్ బ్రేకులు వంటి సదుపాయాలు ఉన్నాయి.
రోడ్ స్టర్ ఎక్స్ ప్లస్
ఓలా రోడ్ స్టర్ ఎక్స్ ప్లస్ మోడల్ బైక్ రెండు రకాల బ్యాటరీ వేరియంట్లలో తీసుకువచ్చారు. 4.5 కేడబ్ల్యూహెచ్ వేరియంట్ ధర రూ.1,19,999గా ఉంది. సింగిల్ చార్జింగ్ పై 259 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు.
9.1 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో వచ్చే వేరియంట్ ధరను రూ.1,69,999గా నిర్ణయించారు. సింగిల్ చార్జింగ్ పై 501 కిలోమీటర్లు రేంజ్ వస్తుంది. గంటలకు 125 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయవచ్చు.
సిరామిక్ వైట్, ఫైన్ గ్రీన్, ఇండస్ట్రియల్ సిల్వర్, స్టెల్లర్ బ్ల్యూ, అంతా సైట్ తదితర రంగుల్లో లభిస్తాయి.