ఓ వైపు బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. దీంతో తమ డబ్బును ఆదా చేసుకునేందుకు ఇతర మార్గాలను చూసుకుంటున్నారు డిపాజిటర్లు. ఈ క్రమంలో పోస్టాఫీస్‌లో డిపాజిట్ చేయడం మంచిందంటున్నారు. పోస్టాఫీస్ స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌లో బ్యాంకుల కన్నా ఎక్కువ వడ్డీ లభిస్తుంది. స్మాల్ సేవింగ్ స్కీమ్‌పై 4 నుంచి 8.6 శాతం వరకు వడ్డీ రేటు లభిస్తోంది. పథకాన్ని బట్టి వడ్డీ రేటు మారుతూ ఉంటుంది. ఇక 5 ఏళ్లు లేదా అంతకన్నా ఎక్కువ కాలం డబ్బులు డిపాజిట్ చేయాలని భావించే వారికి పోస్టాఫీస్ మూడు అద్భుతమైన పథకాలను అందిస్తోంది. అవేంటంటే..!
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్‌ఎస్‌సీ)
ఈ స్కీమ్‌లో డబ్బులు డిపాజిట్ చేస్తే ఇప్పుడైతే 7.9 శాతం వడ్డీ లభిస్తోంది. ఈ వడ్డీ మొత్తం ఏడాదికొకసారి మీ ఖాతాకు జమవుతుంది. అంతేకాదు ఈ స్కీమ్‌లో రూ.100 కూడా డిపాజిట్ చేయొచ్చు. గరిష్ట పరిమితి కూడా ఏం ఉండదు. ఈ పథకం మెచ్యూరిటీ కాలం ఐదేళ్లు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద ఈ స్కీమ్‌కు పన్ను ప్రయోజనాలు కూడా వర్తిస్తాయి.
పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ అకౌంట్
పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ అకౌంట్‌లో వడ్డీ మొత్తం ప్రతి మూడు నెలలకొకసారి అకౌంట్‌కు జమవుతుంది. ప్రస్తుతం ఈ పథకానికి 6.9 శాతం వరకు చెల్లిస్తారు. అయితే దీన్ని సంవత్సరానికి ఒకసారి చెల్లిస్తారు. ఈ అకౌంట్‌లో కనీసం రూ.200 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. దీనికి కూడా గరిష్ట పరిమితి ఉండదు. ఈ అకౌంట్‌ను ఐదేళ్ల వరకు కొనసాగించ వచ్చు.ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ)
ఈ స్కీమ్‌పై కూడా 7.6 శాతం వడ్డీ పొందొచ్చు. ప్రతి సంవత్సరం వడ్డీ మొత్తం అకౌంట్‌కు జమవుతుంది. అయితే ఇందులో కనీసం రూ.1,000 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ స్కీమ్‌కు కూడా గరిష్ట పరిమితి ఉండదు. ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసిన డబ్బు 9 ఏళ్ల 5 నెలల కాలంలో రెట్టింపు అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం. ఈ మూడింటిలో ఏదో ఒక పథకం కింద డబ్బు డిపాజిట్ చేయండి. మంచి వడ్డీతో లాభాలు పొందండి.