ప్రపంచ వ్యాప్తంగా పెరిగిన టెక్నాలజీ కారణంగా వివిధ రంగాల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో చెప్పుకోదగిన మార్పులు వచ్చాయి. రెండు దశాబ్దాలుగా బ్యాంకింగ్ రంగంలో ఏటీఎం సేవలు విపరీతంగా ప్రజాదరణ పొందాయి. అయితే మొదట్లో ఈ సేవలను ఉచితంగా అందించిన బ్యాంకులు క్రమేపి చార్జీలు వసూలు చేయడం ప్రారంభించాయి. ప్రతి నెలా, బ్యాంకులు నిర్ణీత సంఖ్యలో ఉచిత ఏటీఎం లావాదేవీలను మాత్రమే అందిస్తాయి. అయితే ఎంచుకున్న పొదుపు ఖాతా రకాన్ని బట్టి కూడా ఇది మారుతుంది. నిర్ణీత పరిమితిని దాటినప్పుడు ఆర్థిక, ఆర్థికేతర సేవలతో సహా ఏవైనా అదనపు లావాదేవీలపై బ్యాంకులు రుసుము విధిస్తాయి. మరొక బ్యాంకు ఏటీఎంలో విత్‌డ్రా చేస్తే ఉచిత లావాదేవీలు, ఛార్జీలు మారుతూ ఉంటాయి.
గతేడాది జూన్‌లో ఆర్‌బీఐ బ్యాంకులు ఖాతాదారులకు అందించే నెలవారీ ఉచిత ఏటీఎం లావాదేవీలపై పరిమితి విధించింది. ఈ పరిమితి జనవరి 1, 2022 నుంచి అమల్లోకి వచ్చింది. ఆర్‌బీఐ ఆదేశాల మేరకు బ్యాంకులు తమ ఖాతాదారులకు నెలకు 5 ఉచిత లావాదేవీలకు అనుమతినిచ్చింది. అయితే మెట్రో సిటీల్లోని ఏటీఎంల్లో అయితే మూడు లావాదేవీలు ఉచితంగా అందించాలని సూచించింది. అంతకు మించి లావాదేవీలు చేసే కస్టమర్లపై ఒక్కో లావాదేవిపై రూ.20 ప్లస్ ట్యాక్స్ విధించేలా వెసులుబాటును కల్పించింది. అధిక ఇంటర్‌చేంజ్ రుసుమును బ్యాంకులకు భర్తీ చేయడానికి, ఖర్చుల సాధారణ పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని, ప్రతి లావాదేవీకి కస్టమర్ ఛార్జీలను వసూలు చేయడానికి ఈ ఆదేశాలు ఇచ్చింది. ఈ చార్జీలు గతేడాది నుంచి అమలులో ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఏయే బ్యాంకుల కస్టమర్లకు ఎంత మేర చార్జీలు వసూలు చేస్తున్నాయో? తెలుసుకుందాం.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ ఖాతాదారులు సగటు నెలవారీ బ్యాలెన్స్‌లు రూ. 25000 వరకు ఉంటే ఐదు ఏటీఎం ఉచిత లావాదేవీలను (ఆర్థిక, ఆర్థికేతర) అందిస్తుంది. అయితే నిర్ణీత పరిమితికి మించిన ఆర్థిక లావాదేవీలు చేస్తే ఎస్‌బీఐ ఏటీఎం వాడితే రూ. 10 + జీఎస్టీ, ఇతర బ్యాంక్ ఏటీఎంల్లో అయితే రూ. 20 + జీఎస్టీ ఉంటుంది.
మెట్రో, నాన్-మెట్రో ప్రాంతాల్లో ఉన్న పీఎన్‌బీ ఏటీఎంల్లో నెలకు 5 ఉచిత లావాదేవీలను పొందవచ్చు. నిర్దేశించిన పరిమితి తర్వాత ప్రతి లావాదేవీకి రూ. 10 + జీఎస్టీను కస్టమర్ల నుంచి వసూలు చేస్తారు. అలాగే ఇతర బ్యాంక్ ఏటీఎంలను వాడితే రూ.21తో పాటుగా జీఎస్టీలు కస్టమర్ల నుంచి వసూలు చేస్తారు.
ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ప్రముఖ బ్యాంకు అయిన హెచ్‌డీఎఫ్‌సీ తన ఏటీఎంలలో 5 ఉచిత లావాదేవీలను అందిస్తుంది. ఇతర బ్యాంకుల వద్ద బ్యాంకు మెట్రో స్థానాల్లో మూడు ఉచిత లావాదేవీలను అందిస్తుంది, ఆ తర్వాత నగదు ఉపసంహరణల కోసం రూ. 21 తో జీఎస్టీను వసూలు చేస్తుంది.
ఉచిత ఉపసంహరణల విషయానికి వస్తే ఐసీఐసీఐ బ్యాంక్ ఇతర బ్యాంకులు అనుసరిస్తున్న విధంగా మెట్రో సిటీల్లో 3, నాన్ మెట్రో సిటీల్లో 5 లావాదేవీలను ఉచితంగా అందిస్తుంది. ఈ పరిమితి దాటితే ఆర్థిక లావాదేవీకి రూ.20 ప్లస్ జీఎస్టీ, ఆర్థకేతర లావాదేవీకి రూ.8.50 ప్లస్ జీఎస్టీను ఖాతాదారుల నుంచి వసూలు చేస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..