Car Loan: కార్ లోన్ తీసుకుంటున్నారా? ఇవి తెలుసుకోకపోతే తీవ్ర నష్టం..

మనం అవసరాలు, ప్రయాణ సౌలభ్యం కోసం కార్లు కొనడం మంచిదే. అయితే ఆర్థికంగా నష్టపోకుండా, తెలివిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఇటీవల కాలంలో అందరూ కార్ లోన్ తీసుకుంటున్నారు. కొంత మొత్తం డౌన్ పేమెంట్ కట్టి.. మిగిలినది ఈఎంఐ రూపంలో చెల్లించేలా లోన్ తీసుకుంటున్నారు. అయితే కార్ లోన్ తీసుకునే మందు కొన్ని అంశాలను తప్పనిసరిగా తెలుసుకోవాల్సి ఉంటుంది. అవేంటంటే..

Car Loan: కార్ లోన్ తీసుకుంటున్నారా? ఇవి తెలుసుకోకపోతే తీవ్ర నష్టం..
Car Loan

Updated on: Mar 22, 2024 | 8:24 AM

కొత్త కారు తీసుకోవాలనుకుంటున్నారా? మీరు కొనాలనుకునే కారు ఫీచర్లు, మైలేజీ, టెక్నాలజీ తదితర అంశాలన్ని తెలుసుకునే ఉంటారు. దాని వేగం, ఇంజిన్ సామర్థ్యం తదితర వాటిపైనా అవగాహన వచ్చే ఉంటుంది. వీటితో పాటు మీరు గమనించాల్సిన ఇతర అంశాలు ఉన్నాయి. వాటిపైనా మీరు అవగాహన కలిగి ఉంటే ఆర్థికంగా నష్టపోకుండా ఉంటారు. నేడు మార్కెట్ లోకి నిత్యం అనేక రకాల ఫీచర్లతో కార్లు విడుదలవుతున్నాయి. సౌకర్యం, వేగం, సాంకేతికత ఇలా అన్ని విషయాల్లో ఒక దానికి మంచి మరొకటి ఉంటున్నాయి. వీటిని కొనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. కొత్తగా కారు తీసుకునేవారితో పాటు, ఉన్న కారును మార్చి కొత్త కారు తీసుకునేవారు పెరుగుతున్నారు. మనం అవసరాలు, ప్రయాణ సౌలభ్యం కోసం కార్లు కొనడం మంచిదే. అయితే ఆర్థికంగా నష్టపోకుండా, తెలివిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఇటీవల కాలంలో అందరూ కార్ లోన్ తీసుకుంటున్నారు. కొంత మొత్తం డౌన్ పేమెంట్ కట్టి.. మిగిలినది ఈఎంఐ రూపంలో చెల్లించేలా లోన్ తీసుకుంటున్నారు. అయితే కార్ లోన్ తీసుకునే మందు కొన్ని అంశాలను తప్పనిసరిగా తెలుసుకోవాల్సి ఉంటుంది. అవేంటంటే..

గమనించాల్సిన ప్రధాన అంశాలు

  • కారు కొనడానికి సాధారణంగా లోన్ తీసుకుంటాం. అయితే అన్ని సంస్థలూ రుణాలపై వడ్డీని ఒకే రకంగా విధించవు. కాబట్టి రుణమిచ్చే సంస్థలను జాగ్రత్తగా పరిశీలించాలి. వడ్డీరేట్లు, రుణ నిబంధనలు, ప్రాసెసింగ్ ఫీజులను తెలుసుకోవాలి. తక్కువ వడ్డీ విధిస్తున్న సంస్థను ఎంపిక చేసుకోవాలి.
  • మీకు రుణం ఇవ్వడం, దానిపై వడ్డీరేటు నిర్ణయించడంలో మీ క్రెడిట్ స్కోర్ ఎంతో కీలకం. లోన్ కోసం దరఖాస్తు చేసే ముందు మీ క్రెడిట్ స్కోర్‌ను తనిఖీ చేసుకోండి. అవసరమైతే దాన్ని మెరుగుపరచండి. క్రెడిట్ స్కోర్ ఎక్కువగా ఉంటే మీకు తక్కువ వడ్డీ రేటుకు అధిక రుణం మంజూరు చేసే అవకాశం ఉంటుంది.
  • కారులో ఎన్ని ఎక్కువ ఫీచర్లు ఉంటే దానికి అనుగుణంగా ధర ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి ఆధారంగా కారును ఎంచుకోండి. నెలవారీ వాయిదాల చెల్లింపునకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోండి.
  • కారు తీసుకోవడానికి ముందుగా కొంత డౌన్ పేమెంట్ కట్టాలి. మిగిలిన సొమ్మును లోన్ గా మంజూరు చేస్తారు. ఈ డౌన్ పేమెంట్ ఎక్కువ మొత్తం కట్టేలా చూసుకోవాలి. దానివల్ల మనకు నెలవారీ వాయిదాల చెల్లింపులు తగ్గుతాయి. రుణంపై వడ్డీ తక్కువగా ఉంటుంది.
  • కారు లోన్ తీసుకునే సమయంలో చాలా మంది ఈక్వేటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్ (ఈఎమ్ఐ)పైనే దృష్టి పెడతారు. తక్కువ ఈఎమ్ఐ ఉండేలా చూసుకోవాలనుకుంటారు. తక్కువ ఈఎమ్ఐల వల్ల రుణం చెల్లించడానికి ఎక్కువ సమయం పడుతుంది. వడ్డీ కూడా ఎక్కువగా ఉంటుంది.
  • కొత్త కారును కొనేటప్పుడు బీమా ప్రీమియం, రిజిస్ట్రేషన్ ఫీజులు, పన్నులు, నిర్వహణ, ఇంధన ఖర్చులు అదనంగా ఉంటాయి. కాబట్టి వాటిని కూడా కారు బడ్జెట్ లో చేర్చి ప్లాన్ చేసుకోవాలి. లేకపోతే ఆర్థిక ఇబ్బందులు పడతారు.
  • కారును కొనేటప్పుడు దాని రీసేల్ వాల్యూ ను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ప్రజాదరణ పొందిన మోడళ్లకు ఈ అవకాశం ఉంటుంది. అలాంటి కార్లను ఎంచుకోవడం మంచిది.
  • కారు లోన్ పై ముందస్తు ఆమోదం పొందాలి. లోన్ ప్రీ అప్రూవల్ కారణంగా మీకు బడ్జెట్‌పై స్పష్టమైన అవగాహన వస్తుంది. కారు కొనడానికి వెళ్లినప్పుడు ఒత్తిడి లేకుండా ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..