
ఆయుష్మాన్ భారత్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకంలో భాగంగా రోగుల హెల్త్ రికార్డులను నిర్వహించేందుకు ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ తయారుచేస్తున్నారు. ప్రస్తుతం కేవలం ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగుల హిస్టరీని మాత్రమే ఈ విధానం ద్వారా తయారుచేస్తున్నారు. కానీ ఇక నుంచి ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా ఈ అకౌంట్ నమోదు చేయనున్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్‌లో కూడా రోగుల సమగ్ర సమాచారం, మెడికల్ హిస్టరీ సిద్దం చేయనున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా అభా అకౌంట్ తయారుచేయాలని నిర్ణయించింది.
యాదాద్రి జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ విధానం అమలు చేయలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేసిన తర్వాత మిగతా అన్ని జిల్లాల్లోనే ఈ విధానం ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే చాలా రాష్ట్రాలు ప్రైవేట్ ఆస్పత్రుల్లోనే వివరాలు నమోదు చేస్తున్నారు. కర్ణాటకతో పాటు చాలా రాష్ట్రాలు ఇదే విధానం పాటిస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రైవేట్ ఆస్పత్రులకు దీనిని విస్తరించాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఆభా అకౌంట్ నమోదు చేస్తే ఒక్కొ రోగికి రూ.20 చొప్పున ప్రభుత్వ ఆస్పత్రులకు కేంద్రం చెల్లిస్తుంది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా అమలు చేయడం వల్ల దేశంలోని ప్రతి రోగికి సంబంధించిన సమాచారం మొత్తం డిజిటల్ రూపంలో అందుబాటులో ఉంచినట్లు అవుతుంది. రోగి ఏదైనా అస్పత్రికి వెళ్లినప్పుడు డాక్టర్లు ఈ సమాచారాన్ని చూసి వెంటనే చికిత్స అందిచవచ్చు. రోగికి సంబంధించిన పాత విషయాలు అన్నీ సులభంగా తెలుసుకునే వీలుంటుంది.
అలాగే ఈ అకౌంట్ ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా ప్రవేశపెట్టడం వల్ల ప్రైవేట్ హాస్పిటళ్లల్లో రోగులకు అందుతున్న వైద్య సేవలు, చికిత్స, మెడికల్ టెస్టుల సమాచారం మొత్తం ప్రభుత్వానికి తెలుస్తుంది. రోగుల బ్లడ్ గ్రూప్, గతంలో వారికి జరిగిన ఆపరేషన్లు, మెడికల్ టెస్టులు ఇలా మెడికల్ హిస్టరీ మొత్తం ప్రభుత్వానికి తెలిసే అవకాశముంటుంది. దీంతో తొలుత ప్రైవేట్ హాస్పిటళ్లకు ఈ అకౌంట్ నమోదుపై ట్రైనింగ్ ఇవ్వనున్నారు. అనంతరం దీనిని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రజలు ఆస్పత్రులతో సంబంధం లేకుండా ఈ అకౌంట్‌ను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఆభా యాప్‌లో మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీ వివరాలు అందిస్తే ఆభా అకౌంట్ క్రియేట్ అవుతుంది.