టాటా గ్రూప్ త్వరలో Google Pay, Phonepe, Paytm వంటి డిజిటల్ చెల్లింపు యాప్‌లతో పోటీ పడడానికి సిద్ధమవుతుంది. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. భారతదేశంలోని అతిపెద్ద సంస్థ అయిన టాటా గ్రూప్.. ఉప్పు నుంచి ఉక్కు వరకు అనేక రంగాలలో మార్కెట్ లీడర్‌గా ఉంది. ఇప్పుడు కొత్తగా డిజిటల్ చెల్లింపు మార్కెట్‌లోకి అడుగు పెట్టనుంది. ఇందుకు సంబంధించి థర్డ్-పార్టీ పేమెంట్స్ సర్వీస్ ప్రొవైడర్‌ను ప్రారంభించే ముందు కంపెనీ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) నుంచి క్లియరెన్స్ కోరుతున్నట్లు నివేదిక పేర్కొంది. ప్లాట్‌ఫారమ్ లావాదేవీల కోసం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI)ని ఉపయోగించనుంది.
UPI యాప్ టాటా గ్రూప్ డిజిటల్ కామర్స్ యూనిట్ టాటా డిజిటల్ కింద ఉండనుంది. UPI సిస్టమ్‌ను కోసం ICICI బ్యాంక్‌తో చర్చలు జరుపుతోంది. నాన్ బ్యాంక్ సంస్థలు థర్డ్ పార్టీ పేమెంట్ సర్వీసులను ప్రారంభించేందుకు బ్యాంక్‌లతో ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే దేశీయంగా యూపీఐ సేవల్ని అందిస్తున్న గూగుల్ పే ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే.
భారతదేశంలో ఎక్కువ శాతం యూపీఐ లావాదేవీలు గూగుల్ పే లేదా ఫోన్‌పేలో జరుగుతాయి. ఇక పేటీఎం, అమెజాన్ పే, వాట్సాప్ పే వంటి ఇతర యాప్‌లు మార్కెట్‌ను కలిగి ఉండగా.. తాజాగా టాటా గ్రూప్ రంగంలోకి దిగడంతో యూపీఐ పేమెంట్స్ యాప్స్ మధ్య పోటీ పెరగనుంది. టాటా డిజిటల్‌ను 2019లో స్థాపించారు. ఇది టాటా సన్స్ కిందకి వస్తుంది. టాటా సన్స్ అనుబంధ సంస్థలను కలిగి ఉంది. ఈ జాబితాలో Bigbasket, 1MG Technologies Private Limited వంటి కంపెనీలు ఉన్నాయి. జనవరిలో టాటా గ్రూప్ కూడా టాటా ఫిన్‌టెక్, ఆర్థిక ఉత్పత్తుల కోసం ఆర్థిక మార్కెట్‌ను ఏర్పాటు చేసింది. టాటా యూపీఐ త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
Read Also.. Stock Markets: బంపర్ లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. తిరిగి వస్తున్న విదేశీ మదుపరులు..