Gig workers Strike: క్రిస్మస్, న్యూఇయర్ రోజుల్లో స్విగ్గీ, జోమాటో సేవలు బంద్!

గిగ్ వర్కర్లు తమకు పనికి తగిన వేతనం గానీ, గౌరవం గానీ, భద్రత గానీ లభించడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే స్విగ్గీ, జోమాటో తదితర సంస్థల డెలివరీ వర్కర్లు దేశ వ్యాప్తంగా డిసెంబర్ 25, డిసెంబర్ 31 తేదీల్లో సేవలను నిలిపివేసేందుకు సిద్ధమయ్యారు.

Gig workers Strike: క్రిస్మస్, న్యూఇయర్ రోజుల్లో స్విగ్గీ, జోమాటో సేవలు బంద్!
Swiggy Zomato

Updated on: Dec 24, 2025 | 6:59 PM

దేశ వ్యాప్తంగా ఉన్న అనేక నగరాల్లో ప్రజలకు ఆహార పదార్థాలను, నిత్యావసరాలను అందించడంలో డెలివరీ బాయ్స్ (Gig workers) ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నారు. పొద్దున్నుంచి రాత్రీ వరకు కస్టమర్లు ఆర్డర్లు పెట్టిన నిమిషాల్లోనే వారి ఇంటికి చేరుస్తున్నారు. అయితే, గిగ్ వర్కర్లకు మాత్రం పనికి తగిన వేతనం గానీ, గౌరవం గానీ, భద్రత గానీ లేకపోవడంతో వారిలో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలోనే స్విగ్గీ, జోమాటో తదితర సంస్థల డెలివరీ వర్కర్లు దేశ వ్యాప్తంగా సేవలను నిలిపివేసేందుకు సిద్ధమయ్యారు.

ఆర్డర్లు అత్యధికంగా ఉండే క్రిస్మస్ (డిసెంబర్ 25), నూతన సంవత్సరం (డిసెంబర్ 31).. ఈ రెండు రోజుల్లో తాము సమ్మె చేస్తున్నట్లు దేశ వ్యాప్తంగా ఉన్న గిగ్ వర్కర్ సంఘాలు ప్రకటించాయి. పనికి తగిన వేతనం, గౌవరం లేకపోవడం, భద్రత, సోషల్ సెక్యూరిటీ లేకపోవడం వల్లే తాము సమ్మెకు సిద్ధమైనట్లు తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (TGPWU) సమ్మెకు దిగుతున్నట్లు పేర్కొంది. పండగలు, ఇతర ప్రత్యేక సందర్భాల్లో ఎక్కువ పని చేయిస్తున్న డెలివరీ సంస్థలు అందుకు తగినట్లుగా మాత్రం వేతనం చెల్లించడం లేదు. జాబ్ సెక్యూరిటీ కూడా లేదు. గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం సంస్థలు కనీసం చర్యలు తీసుకోవడం లేదని టీజీపీడబ్ల్యూయూ ప్రెసిడెంట్ షేక్ సలాలుద్దీన్ ఆందోళన వ్యక్తం చేశారు.

దేశ వ్యాప్తంగా డిసెంబర్ 25, 31 రోజుల్లో తాము తమ సేవలను నిలిపివేస్తున్నట్లు గిగ్ వర్కర్లు సోషల్ మీడియాలో ప్రకటిస్తున్నారు. బ్లింకిట్, స్విగ్గీ, జోమాటో(Blinkit, Swiggy, Zomato) లాంటి సంస్థలు టార్గెట్లను పెంచుతూ తమకు చెల్లించే మొత్తాలను మొత్తాలను మాత్రం తగ్గిస్తున్నాయని వాపోతున్నారు.

దేశంలో భారీగా పెరుగుతున్న గిగ్ వర్కర్లు

మరోవైపు, కేంద్ర ప్రభుత్వం గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం పలు చర్యలను చేపడుతున్న విషయం తెలిసిందే. 2020లో తొలిసారి గిగ్ వర్కర్లను మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్ డొమెయిన్‌లో చేర్చింది. గిగ్ వర్కర్లకు సోషల్ సెక్యూరిటీ, ప్రొటెక్షన్ కల్పించాల్సిన బాధ్యత ఆయా సంస్థలపై ఉందని అని పేర్కొంది. కాగా, దేశంలో 2021లో 7.7 మిలియన్లుగా ఉన్న గిగ్ వర్కర్ల సంఖ్య 2030 నాటికి 23.5 మిలియన్లకు పెరిగే అవకాశం ఉందని నీతి ఆయోగ్ అంచనా వేసింది.

తెలంగాణ, కర్ణాటక, జార్ఖండ్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాలు గిగ్ వర్కర్లకు కనీస హక్కులు కల్పించేందుకు చట్టాలు చేశాయి. ఆయా సంస్థలు గిగ్ వర్కర్ల సామాజిక భద్రత, సంక్షేమం నిధిని ఏర్పాటు చేసి వారికి అండగా ఉండాలని ప్రభుత్వాలు పేర్కొంటున్నాయి. పనికి తగిన వేతనం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని, గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం బోర్డ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. అయినప్పటికీ వాటిలో పలు లోపాలున్నాయని గిగ్ యూనియన్లు చెబుతున్నాయి. ప్రభుత్వాలు డెలివరీ సంస్థలపై మరింత ఒత్తిడి తీసుకొచ్చి గిగ్ వర్కర్లకు న్యాయమైన వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకునేలా చూడాలని కోరుతున్నాయి.

గిగ్ వర్కర్ల ప్రధాన డిమాండ్లు

గిగ్ వర్కర్లు ప్రధానంగా పలు డిమాండ్లను ఆయా సంస్థల ముందుంచారు. పనికి తగిన విధంగా పారదర్శకమైన వేతనాల చెల్లింపు, పని గంటలకు తగిన ఇన్సెంటివ్స్ చెల్లింపులు ఉండేలా చర్యలు తీసుకోవడం. అర్బిటరీ బ్లాకింగ్ ఐడీస్, జరిమానాలు లాంటి చర్యలను విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గిగ్ వర్కర్లకు సంక్షేమం కోసం చర్యలు చేపట్టాలని, యాక్సిండెంట్ ఇన్స్యూరెన్స్ లాంటి సదుపాయాలను కల్పించాలని కోరుతున్నారు. సోషల్ సెక్యూరిటీ, హెల్త్ ఇన్స్యూరెన్స్, యాక్సిడెంటల్ కవరేజ్, పెన్షన్ బెనిఫిట్స్ లాంటి వాటితోపాటు జాబ్ సెక్యూరిటీ, సంస్థలు, కస్టమర్ల నుంచి తగిన గౌరవం లభించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జాబ్ సెక్యూరిటీ, లైఫ్ సెక్యూరిటీ, ఆర్థికంగా  భరోసా కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ రెండు రోజులు తాము సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.