Retirement Plan
చదువు పూర్తయింది.. ఉద్యోగం వచ్చింది.. పెళ్లి చేసుకున్నాం.. ఇల్లు కొనుకున్నాం.. పిల్లల్ని కన్నాం.. వారి చదువుల కోసం కష్టపడాలి.. తరువాత వారి పెళ్ళిళ్ళు.. వారి పిల్లలు.. జీవితం చివరికి వచ్చేసింది. జీవితపు అన్ని అంకాలలోనూ ఎక్కడా కూడా మన వృద్ధాప్యంలో పరిస్థితి ఏమిటీ అనే ఆలోచన చాలామంది చేయరు. సాధారణంగా రిటైర్మెంట్ ప్లాన్ అనేది మనలో చాలామంది జీవిత ప్రయాణంలో పెద్దగా ప్రాధాన్యత లేని అంశం. ఎప్పటికప్పుడు వచ్చే ఆర్ధిక సవాళ్లు ఎప్పుడో దూరంగా వచ్చే రిటైర్మెంట్ కోసం ఆలోచించే అవకాశాన్ని ఇవ్వకపోవడం పెద్దగా ఆశ్చర్యం కలిగించే అంశం కాదు.
అయితే ఇటీవల కొన్ని సర్వేల్లో వచ్చిన గణాంకాలు చూస్తే మతిపోతుంది. ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఒకరు తమ రిటైర్మెంట్ కోసం చేసిన సేవింగ్స్ రిటైర్మెంట్ తరువాత 5 ఏళ్లకు పూర్తిగా ఖాళీ అయిపోయిందని వాపోతున్నారు. వారిలో చాలామందిలో తమ రిటైర్మెంట్ కోసం ముందుగా సరిగ్గా ప్లాన్ చేసుకోలేకపోయామే అనే బాధ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రిటైర్మెంట్ తర్వాత జీవితం సాఫీగా సాగిపోవాలంటే రిటైర్మెంట్ ప్లాన్ ప్రతి ఒక్కరి జీవితంలో ఎందుకు ముఖ్యం అనే విషయాన్ని పరిశీలిద్దాం.
- పెరిగిన ఆయుర్దాయం: ప్రజల జీవన కాలం పెరిగింది. అంటే పదవీ విరమణ తరువాత జీవితం అనేక దశాబ్దాలుగా ఉంటుంది. ఈ సమయంలో మీ జీవనశైలికి మద్దతు ఇవ్వడానికి మీకు తగినంత పొదుపు ఉందని నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం.
- ద్రవ్యోల్బణం: ద్రవ్యోల్బణం కారణంగా జీవన వ్యయం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఈరోజు ఒక వస్తువు రూ.100తో కొనుగోలు చేయవచ్చు. తదుపరి 10 సంవత్సరాలలో అదే వస్తువు ఆ ధరకు దొరకదు. మీ కొనుగోలు శక్తిని కొనసాగించడానికి, మీరు తెలివిగా పెట్టుబడి పెట్టాలి.
- ఆరోగ్య సంరక్షణ ఖర్చులు: మీ వయస్సు పెరిగే కొద్దీ ఆరోగ్య సంరక్షణ ఖర్చులు గణనీయంగా పెరుగుతాయి. ఒత్తిడి లేని పదవీ విరమణ కోసం ఈ ఖర్చులను కవర్ చేయడానికి ఆర్థిక పరిపుష్టి చాలా అవసరం.
- కాంపౌండింగ్ ఆదాయం: మీరు పదవీ విరమణ కోసం ఎంత త్వరగా పొదుపు చేయడం ప్రారంభిస్తే, కంపౌండింగ్ శక్తి ద్వారా మీ డబ్బు వృద్ధి చెందడానికి ఎక్కువ సమయం ఉంటుంది. చిన్న, సాధారణ పెట్టుబడులు కూడా కాలక్రమేణా గణనీయమైన సొమ్ములుగా పెరుగుతాయి.
- క్యాష్ ఫ్లోకు బాధ్యత వహించండి: రిటైర్‌మెంట్ ఫండ్‌లు మీ పదవీ విరమణ అనంతర సంవత్సరాల్లో మీ నగదు ప్రవాహాన్ని నిర్వహించడంలో మీకు సహాయపడటానికి ప్రత్యేకంగా రూపొందించి ఉంటాయి. ఇటువంటి ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా రోజువారీ ఖర్చుల గురించి చింతించకుండా మీ జీవనశైలిని నిర్వహించగలరని నిర్ధారిస్తూ, సాధారణ ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది.