
గునియా పిగ్స్ అనేవి రోడెంట్ జాతికి చెందిన జంతువులు. వీటిని సాధారణంగా కేవి అని కూడా పిలుస్తారు. సుమారు 5000 బీసీ కాలం నుంచే ఆదివాసీయులు వీటిని పెంచుకున్నారు. ఇవి అల్లరి చేయని పెంపుడు జంతువులుగా పేరుపొందాయి. అనేకమంది వీటిని పెట్స్‌గా పెంచుకోగా, కొందరు వీటి మాంసాన్ని కూడా తీసుకుంటారు. పరిశోధనలలో కూడా గునియా పిగ్స్‌ను విస్తృతంగా ఉపయోగిస్తారు. గునియా పిగ్ పెంపకం చాలా సులభం, ఇవి త్వరగా పెరుగుతాయి. ఎక్కువ పిల్లలను పెడతాయి. వీటిని కేజ్‌లలో లేదా విశాలమైన ఇండోర్ ప్రాంతాలలో ఫెన్సింగ్ వేసి పెంచవచ్చు. గునియా పిగ్స్ సుమారు ఏడు సంవత్సరాలు జీవిస్తాయి. కానీ వాటికి ఆడుకోవడానికి తగినంత స్థలం ఇస్తే ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంటాయి. ఆహారం విషయంలో, ఇవి ఎక్కువగా గ్రాస్, ముఖ్యంగా టిమోతీ, అల్ఫాల్ఫా గ్రాస్‌ను ఇష్టపడతాయి. కొత్తిమీర, పాలకూర, మొక్కజొన్న, అరటిపండు వంటివి అప్పుడప్పుడు అందించవచ్చు. సరైన ఆహారం అందిస్తే ఇవి రోగాల బారిన పడవు.
బ్రీడింగ్ కోసం ఒక మగ గునియా పిగ్‌కు మూడు ఆడ గునియా పిగ్స్ ఉండాలి. ఇవి రెండు నెలలకే బ్రీడింగ్‌కు సిద్ధమైనా, మూడో లేదా నాలుగో నెలలో బ్రీడింగ్ చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటాయి. ఆడ గునియా పిగ్ 16 రోజులు హీట్‌లో ఉండి, కలిసిన 65-70 రోజుల తర్వాత నాలుగు పిల్లల వరకు పెడుతుంది. ఇలా సంవత్సరానికి ఐదు సార్లు పిల్లలను పెట్టగలవు. మార్కెటింగ్ కోసం లోకల్ పెట్ షాప్స్‌కు హోల్ సేల్‌గా అమ్మడం మంచిది. పెట్స్‌గా అమ్మితే ఎక్కువ ఆదాయం వస్తుంది.
ఆదాయం, ఖర్చులను పరిశీలిస్తే.. సుమారు 40 రోజుల నుంచి రెండు నెలల వయస్సు గల సెమీ అడల్ట్ గునియా పిగ్ జత రూ. 500కు లభిస్తుంది. మొదట్లో ఐదు మగ, 16 ఆడ గునియా పిగ్స్‌తో పెంపకం మొదలుపెట్టవచ్చు. రెండు నెలల్లో ఇవి పిల్లలను పెట్టడం ప్రారంభిస్తాయి. మొదటి బ్యాచ్‌లో 16 ఆడ గునియా పిగ్స్ ఒక్కొక్కటి నాలుగు పిల్లల చొప్పున మొత్తం 64 పప్స్‌ను ఇస్తాయి. వీటిలో 50 శాతం ఆడ పిల్లలను మళ్ళీ బ్రీడింగ్‌కు ఉపయోగించి, మిగిలిన మగ పిల్లలను మాంసం కోసం లేదా అమ్మకం కోసం పెంచవచ్చు. మాంసం కోసం పెంచితే రెండు నెలలకే 400 గ్రాముల బరువు వస్తాయి. మూడో బ్యాచ్ నుంచి పిల్లలను అమ్మడం ప్రారంభించవచ్చు. మూడవ బ్యాచ్‌లో సుమారు 600 పప్స్(300 జతలు) వస్తాయి. హోల్‌సేల్‌లో ఒక్కో జతను రూ. 400కు, పెంపుడు జంతువులుగా ఒక్కో జతను రూ. 600కు అమ్మవచ్చు. హోల్‌సేల్‌లో అమ్మితే ఒక బ్యాచ్‌పై రూ. 1,20,000 ఆదాయం వస్తుంది. ఇలా సంవత్సరానికి రూ. 10,000లోపు పెట్టుబడితో, రోజుకు 2-3 గంటల సమయం కేటాయిస్తే సంవత్సరానికి రూ. 2.5 లక్షల వరకు సంపాదించుకోవచ్చు.