
Sri Lanka Working Days: మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంధనాన్ని ఆదా చేసేందుకు శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఉద్యోగులకు కార్యాలయాల పని దినాలను తగ్గిస్తూ, కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది.
శ్రీలంక అవసర సేవల కమిషనర్ జనరల్ ప్రభాత్ చంద్రకీర్తి ప్రకారం.. బుధవారం నుంచి ప్రభుత్వ కార్యాలయాలు వారానికి కేవలం నాలుగు రోజులు మాత్రమే పనిచేస్తాయి. ఈ నిబంధనలు స్కూళ్లు, విశ్వవిద్యాలయాలకూ వర్తిస్తాయి. ఈ విధానం ఎప్పటివరకు కొనసాగుతుందో ఇప్పటికీ స్పష్టత లేదు. అత్యవసర సమావేశం అనంతరం, ప్రైవేట్ సంస్థలు కూడా ఇదే విధానాన్ని అనుసరించాలని ప్రభుత్వం కోరింది. ప్రతి బుధవారం సెలవు ప్రకటించాలని సూచించింది.
ఇది కూడా చదవండి: LPG Gas e-Kyc: కేవైసీ ఎల్‌పీజీ వినియోగదారులందరికీ కాదు.. కీలక ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం
ఈ సమావేశంలో శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసానాయకే కూడా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. “చెడ్డ పరిస్థితులకు సిద్ధంగా ఉండాలి, కానీ మంచి ఫలితాల కోసం ఆశ కూడా ఉండాలి” అని అన్నారు. అయితే ఆసుపత్రులు, పోర్టులు, అత్యవసర సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ప్రభుత్వ కార్యక్రమాలను తాత్కాలికంగా నిలిపివేశారు. అలాగే ఉద్యోగులకు వీలైన చోట ‘వర్క్ ఫ్రం హోమ్’ ఇవ్వాలని సూచించారు
ఇంధన కొరతను దృష్టిలో పెట్టుకుని రేషన్ విధానాన్ని కూడా అమలు చేస్తున్నారు. వ్యక్తిగత వాహనాలకు వారానికి 15 లీటర్ల ఇంధనం మాత్రమే ఇవ్వాలని నిబంధన విధించారు. అలాగే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌కు 200 లీటర్ల వరకు ఇవ్వాలని సూచించారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఇంధన నిల్వలు సుమారు 6 వారాలకు సరిపోతాయని అధికారులు తెలిపారు. అయితే కొత్త సరఫరా ఆగిపోతే పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని హెచ్చరించారు.
ప్రపంచంలో సుమారు 20% చమురు సరఫరా జరిగే హోర్ముజ్ జలసంధి వద్ద పరిస్థితులు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. అమెరికా–ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా చమురు రవాణా అంతరాయం కలిగింది. ఈ యుద్ధం ఇప్పటికే మూడో వారంలోకి ప్రవేశించింది.
శ్రీలంక తన మొత్తం చమురు అవసరాలను దిగుమతుల ద్వారా తీర్చుకుంటుంది. పెట్రోలియం ఉత్పత్తులను సింగపూర్, మలేషియా, దక్షిణ కొరియా నుంచి కొనుగోలు చేస్తుంది. ముడి చమురు ప్రధానంగా మధ్యప్రాచ్య దేశాల నుంచి వస్తుంది.
ఇప్పటికే 2022లో తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్న శ్రీలంక ఇంకా పూర్తిగా కోలుకోలేదు. విదేశీ మారక నిల్వలు తగ్గిపోవడంతో అప్పుల చెల్లింపులు చేయలేకపోయింది. అనంతరం అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) నుంచి 2.9 బిలియన్ డాలర్ల సహాయ ప్యాకేజీ పొందింది. మొత్తంగా ప్రస్తుత పరిస్థితుల్లో ఇంధన వినియోగాన్ని తగ్గించడానికి శ్రీలంక ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. మధ్యప్రాచ్య యుద్ధం మరింత కాలం కొనసాగితే, దేశ ఆర్థిక వ్యవస్థపై మరింత ఒత్తిడి పెరగొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Rythu Bharosa Scheme: తెలంగాణ రైతులకు బిగ్ అలర్ట్.. ఈ పొరపాట్లు చేస్తే రైతు భరోసా రానట్లే!
ఇది కూడా చదవండి: LPG Crisis India: ఇక సామాన్యులకు పండగే.. పండగ.. ఎల్‌పీజీకి చెక్.. భారత్‌లో కొత్త గ్యాస్!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి