మన దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు బాగా విక్రయాలు చేస్తున్నాయి. సంప్రదాయ ఐసీఈ వాహనాలకు దీటుగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్మకాలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో కంపెనీ పెద్ద ఎత్తున ఉత్పత్తులను లాంచ్ చేస్తున్నాయి. సింపుల్ ఎనర్జీ కూడా ఓ కొత్త ఎలక్ట్రిక్ టూ వీలర్ ను లాంచ్ చేసింది. దాని పేరు సింపుల్ డాట్ వన్. దీని ప్రారంభ ధర రూ. 99,999(ఎక్స్ షోరూం)గా ఉంది. ప్రస్తుతం దీని ప్రీ బుకింగ్స్ కూడా కంపెనీ ప్రారంభించింది. మొదట బుక్ చేసుకున్న వినియోగదారులకు ఈ ప్రత్యేకమైన ధర ఉంటుందని, జనవరి 2024లో రేటు కాస్త పెరిగే అవకాశం ఉందని కంపెనీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ సింపుల్ డాట్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
సింపుల్ వన్ ప్లాట్ ఫారంలో డాట్ వన్ అనే స్కూటర్ ను సబ్ వేరియంట్ గా కంపెనీ తీసుకొచ్చింది. ఇది సింగిల్ వేరియంట్ ఫిక్స్ డ్ బ్యాటరీతో వస్తుంది. దీని సర్టిఫైడ్ రేంజ్ 151 కిలోమీటర్లు ఉంటుంది. ఓవరాల్ గా కనీసం 160 కిలోమీటర్ల రేంజ్ వచ్చే అవకాశం ఉంది. ఈ స్కూటర్ యాక్సలరేషన్ కూడా బాగుంటుంది. కేవలం 2.77 సెకండ్లలోనే సున్నా నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇది 12 అంగుళాల 90-90 ట్యూబ్ లెస్ టైర్లు ఉంటాయి.
సింపుల్ డాట్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్లో 3.7కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉంటుంది. అలాగే 8.5కేడబ్ల్యూఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇది గరిష్టంగా 72ఎన్ఎం టార్క్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇక సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే సీబీఎస్, డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. 35 లీటర్ అండర్ సీట్ స్టోరేజ్ ఉంటుంది. యూజర్ ఫ్రెండ్లీ టచ్ స్క్రీన్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది.
ఈ స్కూటర్ నాలుగు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. నమ్మా రెడ్, బ్రేజెన్ బ్లాక్, గ్రేస్ వైట్, అజూరే బ్లూ వంటిల్లో మీరు వీటిని కొనుగోలు చేయొచ్చు. వీటితో పాటు లైట్ ఎక్స్, బ్రేజెన్ ఎక్స్ కలర్ ఆప్షన్స్ లో కూడా కంపెనీ విక్రయాలు చేస్తోంది. బండితో పాటు 750 వాట్ల చార్జర్ ఇస్తారు.
ఈ సందర్భంగా సింపుల్ ఎనర్జీ ఫౌండర్ అండ్ సీఈఓ సుహాస్ రాజ్ కుమార్ మాట్లాడుతూ ఈ సింపుల్ డాట్ వన్ స్కూటర్ తో తమ ఎలక్ట్రిక్ టూ వీలర్ల జాబితాను విస్తరించడం ఆనందంగా ఉందన్నారు. తక్కువ బడ్జెట్లో ఉన్నత స్థాయి ప్రమాణాలతో ఈ స్కూటర్ ను తీసుకొచ్చినట్లు వివరించారు. దీనిలో ఫీచర్లు, బండి పనితీరు వినియోగదారులకు అమితమైన సంతృప్తిని ఇస్తుందని పేర్కొన్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..