
గత కొంతకాలంగా పసిడి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తుంటే ఇప్పుడు వెండి సైతం అదే బాటలో పయనిస్తూ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. కేవలం ఒక్క నెల వ్యవధిలోనే వెండి ధర అమాంతం పెరగడం ఇన్వెస్టర్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గత డిసెంబర్ 21 నాటికి మార్కెట్లో కిలో వెండి ధర రూ.2.31 లక్షలుగా నమోదైంది. అయితే సరిగ్గా నెల రోజులు గడిచేసరికి అంటే జనవరి 20నాటికి ఈ ధర ఏకంగా రూ.3.30 లక్షలకు చేరుకుంది. అంటే కేవలం 30 రోజుల వ్యవధిలోనే కిలో వెండిపై సుమారు 99 వేల రూపాయల పెరుగుదల కనిపించింది. వెండి చరిత్రలో ఇంత తక్కువ కాలంలో ఈ స్థాయిలో ధర పెరగడం ఇదే మొదటిసారి అని విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రస్తుతం గ్రీన్ ఎనర్జీ , ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో వెండి వినియోగం విపరీతంగా పెరిగింది. సోలార్ ప్యానెల్స్ తయారీకి వెండి కీలకమైన లోహం కావడంతో ప్రపంచవ్యాప్తంగా దీనికి విపరీతమైన కొరత ఏర్పడింది. మధ్యప్రాచ్య దేశాల్లో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం, రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా వెండి, బంగారం వైపు మళ్లుతున్నారు. బంగారం ధరలు అసాధారణంగా పెరగడంతో చాలామంది మధ్యతరగతి ప్రజలు, ఇన్వెస్టర్లు వెండిని ప్రత్యామ్నాయ పెట్టుబడిగా ఎంచుకుంటున్నారు. ఫలితంగా డిమాండ్ పెరిగి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ తగ్గడం వల్ల దిగుమతి చేసుకునే వెండి ధరలు దేశీయంగా భారమవుతున్నాయి.
వెండి ధరలు పెరగడం వల్ల కేవలం ఆభరణాల ప్రియులే కాకుండా పూజా సామాగ్రి కొనుగోలు చేసే సామాన్యులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఒకప్పుడు పేదవాడి బంగారంగా పిలవబడే వెండి, ఇప్పుడు ధనవంతులకు కూడా భారంగా మారుతోంది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఈ ధరల పెరుగుదల మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్‌ను తలకిందులు చేస్తోంది. తాజా మార్కెట్ ట్రెండ్స్ ప్రకారం.. వెండి ధరలు ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించడం లేదు. పారిశ్రామిక అవసరాలు, సరఫరాలో ఉన్న లోపాల కారణంగా 2026 చివరి నాటికి వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మీరు వెండిపై పెట్టుబడి పెట్టాలని భావిస్తే లేదా ఆభరణాలు కొనాలనుకుంటే, ప్రతి స్వల్ప ధర తగ్గుదలనూ ఒక అవకాశంగా మార్చుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..