Silver Price: అదిరిపోయే న్యూస్.. గంటల్లోనే రూ.20 వేలకు పైగా తగ్గిన వెండి ధర.. అసలు కారణం ఏంటంటే..?

బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు అనూహ్యంగా పడిపోయాయి. కేవలం కొన్ని గంటల్లో కిలో వెండి రూ.21,000 క్షీణించి ఇన్వెస్టర్లను షాక్‌కు గురిచేసింది. ఇన్ని రోజులు ఇన్వెస్టర్లకు లాభాలు ఇచ్చిన వెండి ఒక్కసారిగా ఎందుకు పడిపోయింది. దానికి గల కారణాలు ఏంటీ..? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం..

Silver Price: అదిరిపోయే న్యూస్.. గంటల్లోనే రూ.20 వేలకు పైగా తగ్గిన వెండి ధర.. అసలు కారణం ఏంటంటే..?
Silver Price Crash

Updated on: Dec 29, 2025 | 4:28 PM

అస్థిరతకు మారుపేరుగా మారిన బులియన్ మార్కెట్‌లో సంచలనం నమోదైంది. గత కొంతకాలంగా రికార్డు స్థాయిల్లో దూసుకుపోతున్న వెండి ధరలు అకస్మాత్తుగా కుప్పకూలాయి. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే కిలో వెండి ధర ఏకంగా రూ.21,000 మేర క్షీణించడంతో ఇన్వెస్టర్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో సోమవారం మధ్యాహ్నం సెషన్‌లో వెండి ఫ్యూచర్స్ భారీగా పతనమయ్యాయి. గత సెషన్‌లో కిలో వెండి ధర రూ.2,54,174 వద్ద ట్రేడ్ అయింది. అయితే లాభాల స్వీకరణ దెబ్బకు ధర ఒక్కసారిగా రూ.2,33,120 కనిష్టానికి పడిపోయింది. అత్యంత గరిష్ట స్థాయిలను తాకిన వెంటనే వ్యాపారులు లాభాలను వెనక్కి తీసుకోవడం ప్రారంభించడంతో మార్కెట్ ఈ స్థాయి పతనాన్ని చూసింది.

అంతర్జాతీయ మార్కెట్ ఒత్తిడి

ప్రపంచ మార్కెట్‌లో కూడా వెండి అస్థిరంగా మారింది. తొలిసారిగా ఔన్సుకు 80 డాలర్ల మార్కును తాకినప్పటికీ, ఆ స్థాయిని ఎక్కువసేపు నిలబెట్టుకోలేకపోయింది. అగ్రరాజ్యం అమెరికా, ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం దిశగా సానుకూల సంకేతాలు రావడం వెండి ధరలపై తీవ్ర ప్రభావం చూపింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో సురక్షిత పెట్టుబడిగా ఉన్న వెండికి డిమాండ్ తగ్గింది. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్‌లో వెండి ఔన్సు ధర 75 డాలర్ల కంటే దిగువకు పడిపోయింది.

భవిష్యత్తులో ధరలు ఎలా ఉండబోతున్నాయి?

ప్రస్తుతం ధరలు తగ్గినప్పటికీ దీర్ఘకాలంలో వెండి మెరిసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో రూ. 2,75,000 చేరుకోవచ్చనే అంచనాలు ఉన్నాయి. జనవరి 1, 2026 నుండి చైనా విధించబోయే ఎగుమతి ఆంక్షలు వెండి సరఫరాపై ప్రభావం చూపుతాయి. వడ్డీ రేట్ల తగ్గింపు సంకేతాలు బంగారం, వెండి ధరలకు బలాన్ని ఇవ్వవచ్చు. గ్లోబల్ ట్రేడ్ వార్స్ మళ్లీ మొదలైతే లోహాల ధరలు పెరిగే ఛాన్స్ ఉంది. బంగారం, వెండి ధరల్లో తీవ్రమైన హెచ్చుతగ్గులు కనిపిస్తున్నందున, పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉండాలని, నిపుణుల సలహాతోనే ముందడుగు వేయాలని మార్కెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి