స్టాక్ మార్కెట్ ఉత్సాహంతో ఉరకలేస్తోంది. టెలికాం, బ్యాంకింగ్ రంగాల షేర్లు దుమ్ము రేపుతున్నాయి. ఈ రంగాల్లో కొనుగోళ్లు జరగడంతో నేటి ట్రేడింగ్‌లో సూచీలు రికార్డు స్థాయి లాభాల్లో దూసుకెళ్తున్నాయి. సెన్సెక్స్ ఒక దశలో 347 పాయింట్ల లాభంతో 40,816 వద్ద సరికొత్త గరిష్ఠాన్ని తాకింది. నిఫ్టీ కూడా 12వేల మార్క్ దాటి ట్రేడ్ అవుతోంది. ఉదయం 11.56 గంటల సమయంలో సెన్సెక్స్ 304 పాయిట్ల లాభంతో 40,773 వద్ద, నిఫ్టీ 83 పాయింట్ల లాభంతో 12,023 వద్ద కొనసాగుతున్నాయి.
జియో టారిఫ్‌లు పెంచుతామని ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు నేడు జోరుమీదున్నాయి. దాదాపు 4శాతం ఎగబాకడంతో షేరు ధర జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. అటు కంపెనీ మార్కెట్ విలువ కూడా రూ. 10లక్షల కోట్ల దరిదాపులకు చేరుకుంది. ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం రిలయన్స్ షేరు ధర 3.53శాతం లాభంతో రూ. 1,563 వద్ద ట్రేడ్ అవుతోంది.