
పశ్చిమాసియాలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తలతో బుధవారం స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. సెన్సెక్స్, నిఫ్టీ 2 శాతానికిపైగా పడిపోయాయి. ఇరాన్‌పై అమెరికా తాజా సైనిక దాడులు, ఇరాన్‌తో కుదిరిన శాంతి అవగాహన ఒప్పందం ముగిసిపోయిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో దేశీయ సూచీలు భారీగా పతనమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1,677.12 పాయింట్లు లేదా 2.15 శాతం తగ్గి 76,503.60 వద్ద ముగియగా.. నిఫ్టీ 50 516.65 పాయింట్లు లేదా 2.12 శాతం తగ్గి 23,882.05 వద్ద స్థిరపడింది. ముడి చమురు ధరలలో భారీ పెరుగుదల వంటి పరిణామాలు అన్ని రంగాలలోనూ విస్తృత అమ్మకాలకు దారితీశాయి.
నిఫ్టీ బ్యాంక్ 2.51 శాతం పడిపోగా, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ సూచీ 2.45 శాతం క్షీణించింది. నిఫ్టీ 100, నిఫ్టీ 500 వరుసగా 2.07 శాతం, 1.97 శాతం నష్టపోయాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 1.55 శాతం పడిపోగా, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 2.24 శాతం పడిపోయింది. స్టాక్ మార్కెట్ల పతనంతో దాదాపు పెట్టుబడిదారుల రూ. 8.13 లక్షల కోట్ల సంపద తుడుచుకుపెట్టుకుపోయింది. బీఎస్ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ గత సెషన్‌లోని రూ. 479.68 లక్షల కోట్ల నుండి జూలై 8వ తేదీ ముగింపు నాటికి రూ. 471.55 లక్షల కోట్లకు పడిపోయింది.
హోర్ముజ్ జలసంధిలో మూడు వాణిజ్య నౌకలపై జరిగిన దాడుల అనంతరం ఇరాన్‌పై అమెరికా కొత్తగా సైనిక దాడులు ప్రారంభించింది. ఇరాన్‌తో అవగాహన ఒప్పందం ముగిసిపోయిందనితాను నమ్ముతున్నానని, ఇది దౌత్య ప్రయత్నాలలో వైఫల్యాన్ని సూచిస్తుందని ట్రంప్ తెలిపారు. ఈ పరిణామాలు ప్రపంచంలోని అత్యంత కీలకమైన ఇంధన రవాణా మార్గాలలో ఒకటైన హోర్ముజ్ జలసంధి ద్వారా చమురు సరఫరాకు సంభావ్య అంతరాయాలపై ఆందోళనలను మరింత పెంచాయి. ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో బ్రెంట్ క్రూడ్ 6.20 శాతం పెరిగి బ్యారెల్‌కు 78.75 డాలర్లకు చేరుకుంది.