హైదరాబాద్ కంపెనీలో సచిన్ భారీ పెట్టుబడి, మహేశ్ బ్రాండ్ అంబాసిడర్!

హైదరాబాద్ నగరానికి చెందిన సోలార్ ఎనర్జీ కంపెనీ సన్‌టెక్ ఎనర్జీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (Truzon Solar)లో 3.6 కోట్ల రూపాయలను భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పెట్టుబడిగా పెట్టారు. సచిన్ ఇన్వెస్ట్ చేయడంతో ట్రూజన్ సోలార్ హర్షం వ్యక్తం చేసింది. ఈ సంస్థకు సూపర్ స్టార్ మహేశ్ బాబు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు.

హైదరాబాద్ కంపెనీలో సచిన్ భారీ పెట్టుబడి, మహేశ్ బ్రాండ్ అంబాసిడర్!
Sachin Mahesh

Updated on: Dec 25, 2025 | 1:29 PM

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ హైదరాబాద్ నగరంలోని ఓ సంస్థలో భారీ పెట్టుబడి పెట్టారు. నగరానికి చెందిన సోలార్ ఎనర్జీ కంపెనీ సన్‌టెక్ ఎనర్జీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (Truzon Solar)లో కోట్ల రూపాయలను ఇన్వెస్ట్ చేశారు.

సన్‌టెక్ ఎనర్జీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో సచిన్ టెండూల్కర్ 2 శాతం వాటాను దక్కించుకున్నారు. ఇందుకోసం ఆయన 1.8 లక్షల షేర్లను రూ. 3.6 కోట్లతో కొనుగోలు చేశారు. డిసెంబర్ 23న ఈ భాగస్వామ్య ప్రకటన జరిగింది. ట్రూజన్ సోలార్ కంపెనీని 2008లో చారుగుండ్ల భవానీ సురేష్ స్థాపించారు. ఇది రెసిడెన్షియల్, కమర్షియల్, యుటిలిటీ-స్కే్ల్ సోలార్ ప్రాజెక్ట్స్, రూఫ్‌టాప్ సిస్టమ్స్, పీఎం-కుసుమ్ స్కీమ్స్‌లలో ప్రత్యేకతను కలిగి ఉంది.

ప్రస్తుతం ఈ కంపెనీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ లాంటి రాష్ట్రాల్లో తమ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తోంది. కొత్తగా తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోనూ మార్కెట్‌ను విస్తరించే పనిలో ఉంది.

సచిన్ పెట్టుబడి..

సచిన్ లాంటి వ్యక్తి తమ సంస్థలో పెట్టుబడి పెట్టడం తమకు గర్వంగా ఉందని ట్రూజన్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ చారుగుండ్ల భవానీ సురేశ్ అన్నారు. ఈ భాగస్వామ్యం పెట్టుబడి మాత్రమే కాదని.. విలువలు, గవర్నెన్స్, సుదీర్ఘ ప్రయాణానికి బలమైన పునాది అని చెప్పారు. సచిన్ తమ సంస్థలోకి రావడంతో తమ బ్రాండ్ క్రెడిబిలిటీ పెరగడమే గాక, దేశ వ్యాప్తంగా తమ సంస్థ విస్తరించేందుకు సహాయపడుతుందన్నారు.

బ్రాండ్ అంబాసిడర్‌గా మహేశ్ బాబు

సచిన్ అంటే ఓ నమ్మకమని, ఆయన దేశానికి గర్వకారణమైన వ్యక్తి అని అన్నారు. అలాంటి వ్యక్తి భాగస్వామ్యం తమ సంస్థకు ఎంతో కలిసి వస్తుందని, ఇండియాలో క్లీన్ ఎనర్జీ మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు. మరోవైపు, ఈ సంస్థ 2024లో సూపర్ స్టార్ మహేశ్ బాబును తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. దీంతో ఆయన సంస్థ ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు. తాజాగా, మరో స్టార్ సచిన్ టెండూల్కర్ ఈ సంస్థలో పెట్టుబడి పెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.