
భారత కరెన్సీ రూపాయి మంగళవారం మార్కెట్లో సత్తా చాటింది. అంతర్జాతీయ పరిణామాలు, ముఖ్యంగా భారత్-యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం దేశీయ మార్కెట్లకు కొత్త ఊపిరి పోసింది. గత శుక్రవారం డాలర్‌తో పోలిస్తే 92 స్థాయికి పడిపోయి ఆల్ టైమ్ కనిష్టాన్ని తాకిన రూపాయి, మంగళవారం నాటికి 19 పైసలు పుంజుకుని 91.71 వద్ద ముగిసింది. భారత్ – ఈయూ ఒప్పందం రూపాయి పుంజుకోవడానికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. 27 దేశాల కూటమితో కుదిరిన ఈ ఒప్పందం భారత ఎగుమతులకు సుంకం లేని మార్కెట్‌ను కల్పిస్తుంది. దీనిని నిపుణులు మదర్ ఆఫ్ ఆల్ డీల్స్‌గా అభివర్ణిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఆరు ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలర్ విలువ 0.12శాతం తగ్గి 96.92కు పడిపోయింది. గత ఏడాదిలో డాలర్ ఏకంగా 10శాతం పతనమవ్వడం రూపాయికి కలిసి వచ్చింది. భారత్ విదేశీ మారక నిల్వలు ఏకంగా 14.16 బిలియన్ డాలర్లు పెరిగి 701.36 బిలియన్ డాలర్ల మార్కును చేరడం దేశ ఆర్థిక బలానికి నిదర్శనంగా నిలిచింది.
మూడు రోజుల సెలవు తర్వాత తెరుచుకున్న మార్కెట్లు లాభాలతో కళకళలాడాయి. సెన్సెక్స్ 319 పాయింట్లు పెరిగి 81,857 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 126 పాయింట్ల లాభంతో 25,175 వద్ద ముగిసింది. EU ఒప్పందం కారణంగా రాబోయే రోజుల్లో మార్కెట్ మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
భారత్-EU ఒప్పందం తర్వాత ఇప్పుడు అమెరికాపై ఒత్తిడి పెరిగింది. భారత వస్తువుల కోసం యూరప్ ఒక పెద్ద మార్కెట్‌గా మారడంతో అమెరికా కూడా భారత్‌తో త్వరగా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మార్చిలో కెనడాతో కూడా భారత్ కీలక చర్చలు జరపనుంది. దీంతో డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భారత్‌కు దగ్గరయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
రూపాయి ఇంకా పెరగాల్సి ఉన్నప్పటికీ, రెండు అంశాలు దాని వేగాన్ని అడ్డుకున్నాయి.. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 65.84 డాలర్లకు పెరగడం రూపాయిపై ఒత్తిడి తెచ్చింది. విదేశీ పెట్టుబడిదారులు జనవరిలో ఇప్పటివరకు సుమారు రూ. 36,811 కోట్ల విలువైన షేర్లను విక్రయించి లాభాలను స్వీకరించారు. అంతర్జాతీయ ప్రతికూలతల మధ్య కూడా భారత్ తన ఆర్థిక పట్టును నిరూపించుకుంటోంది. రాబోయే రోజుల్లో రూపాయి విలువ 91.30 స్థాయికి చేరుకోవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి