
ఈ మధ్యకాలంలో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా కుప్పకూలి, మళ్లీ పుంజుకుంటున్నాయి. భారీగా పెరిగిన ధరలు ఒక్కసారిగా కుప్పకూలడందో పెట్టుబడిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు మళ్లీ పెరుగుతుండటంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే మార్కెట్‌లో ఇంత అనిశ్చితిపై రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అమెరికా ఆర్థిక పరిస్థితి కారణంగానే ఇదంతా జరుగుతోందని అన్నారు. ధరలు బాగా పడిపోయేంత వరకు తాను బిట్‌కాయిన్, బంగారం, వెండిని మరింతగా కొనుగోలు చేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లకు అసలైన ప్రమాదం ధరల హెచ్చుతగ్గుల కంటే, పెరుగుతున్న అమెరికా రుణ భారం అని ఆయన అభిప్రాయపడ్డారు.
అమెరికా ఆర్థిక పరిస్థితిని పెట్టుబడిదారులు ఎదుర్కొంటున్న అత్యంత పెద్ద సమస్యగా కియోసాకి అభివర్ణించారు. అమెరికా జాతీయ రుణం సుమారు 38 ట్రిలియన్ డాలర్లుగా ఉండగా, సోషల్ సెక్యూరిటీ, మెడికేర్ వంటి పథకాలతో మొత్తం భారం 250 ట్రిలియన్ డాలర్ల వరకు పెరుగుతుందని ఆయన అంచనా వేశారు. ఫెడ్, అసమర్థ నాయకులు, నకిలీ డాలర్లతో ప్రజలను దోచుకునే క్రిమినల్ బ్యాంకర్లే అసలైన సమస్య అని కియోసాకి షాకింగ్ కామెంట్స్ చేశారు.
వెండి ధర 60 డాలర్లు, బిట్‌కాయిన్ 6,000 డాలర్లు, బంగారం 300 డాలర్లు వద్ద ఉన్నప్పటి నుంచి తాను కొనుగోలు చేయడం ఆపేశానని కియోసాకి తెలిపారు. తాను కొన్ని బిట్‌కాయిన్లు, కొంత బంగారం విక్రయించాను. కానీ నాకు అమ్మడం నచ్చదు ఎందుకంటే మూలధన లాభాల పన్ను చెల్లించడం నాకు ఇష్టం లేదు అని చెప్పారు. కొత్తగా పెట్టుబడి పెట్టే ముందు, ఈ రెండు ఆస్తుల్లోనూ ధర బాగా పడిపోయే వరకు ఓపికగా వేచి చూస్తున్నాను అని అన్నారు. అయితే కియోసాకి ఈ నిర్ణయం ప్రకటించిన తర్వాత రానున్న కాలంలో బంగారం, వెండి ధరలు తగ్గుతాయని కొంతమంది పెట్టుబడిదారులు భావిస్తున్నారు. ఆర్థిక విషయాల్లో కచ్చితమైన అంచనాలు వేస్తారనే పేరు కియోసాకి ఉంది. ఆయన ఇప్పుడు పెట్టుబడి పెట్టకుండా, ధరలు తగ్గేంత వరకు వేచి ఉండి, అప్పుడు బంగారం, వెండి, బిట్‌కాయిన్ కొంటానని అనడంతో ధరలు తగ్గుతాయనే అభిప్రాయానికి చాలా మంది వచ్చేశారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి