పదిగ్రాముల బంగారం ధర రమారమి లక్ష రూపాయలు. కిలో వెండి ధర లక్షకు అటూఇటూనే. ఒకటోరెండో పెద్దనోట్ల కట్టలు పట్టుకెళితే తప్ప జ్యూవెలరీ షాపులో అడుగుపెట్టే పరిస్థితే లేదు. ఏదైనా శుభకార్యానికి ముహూర్తం పెట్టుకుంటే.. ఇక అంతే సంగతులు. బంగారం కొనుగోళ్లతో ఇల్లు గుల్లవ్వాల్సిందే. ఇది మిడిల్ క్లాస్, ఎబౌ మిడిల్‌క్లాస్ వాళ్ల వ్యథాభరిత చిత్రం. లోయర్ మిడిల్ క్లాస్ కుటుంబాల గాధలు ఇంకో రకం. గ్రామో అరగ్రామో బంగారం కొనుక్కోవడమంటే వాళ్లకది లైఫ్‌టైమ్ అచీవ్‌మెంటే. అందుకే.. సగటు గరీబోడి గోల్డెన్ డ్రీమ్స్ సాకారం చెయ్యడానికా అన్నట్టు కొత్తగా పుట్టుకొచ్చింది వన్‌గ్రామ్ గోల్డ్ అనే టైమ్లీ ట్రెండ్. పాతికవేలు పెడితే.. ఉంగరం కాదు.. ఏకంగా వడ్డాణాలే కొనెయ్యొచ్చు.
వేలకు వేలు పోసి బంగారం కొనలేనివారికి ఇప్పుడు ల్యాబ్ మేడ్ గోల్డ్.. అందుబాటులోకి వచ్చింది. గనుల నుంచి తీసి.. ప్రాసెసింగ్ చేస్తే వచ్చిన బంగారం ఒరిజినల్ బంగారం. దానికి ప్రత్యామ్నాయంగా.. బంగారానికి ఏమాత్రం తగ్గని మెరుపుతో కృత్రిమంగా తయారయ్యేదే ల్యాబ్ మేడ్ గోల్డ్.
పెళ్లిళ్లకు ఫంక్షన్లకు వెళ్లాలనుకునే మధ్యతరగతి కుటుంబాలు ల్యాబ్ మేడ్ గోల్డ్‌నే ఆశ్రయిస్తున్నారు. సంప్రదాయం ప్రకారం ప్రతి పెళ్లిలో ఎంతోకొంత బంగారాన్ని పెట్టాలి. మిగతాది మాత్రం ల్యాబ్ మేడ్ బంగారమే. వన్‌గ్రామ్ గోల్డ్ అనే సౌండ్ చెప్పుకోడానికి ఇబ్బందిగా ఉంది గనుక.. దాన్ని పాలిష్ట్‌గా ల్యాబ్ మేడ్ గోల్డ్ అని పిల్చుకోవడం మొదలైంది.
24 క్యారెట్ బంగారంలో ఎంతొకొంత రాగిని కలిపి కరిగిస్తే తప్ప ఆభరణం తయారు కాదు. అలాగే.. ల్యాబ్‌మేడ్ గోల్డ్‌లో 99 శాతం రాగి, సిల్వర్, అల్యూమినియమ్.. ఒకటీఅరా శాతం బంగారం కలిపి వన్‌గ్రామ్ గోల్డ్ తయారు చేస్తారు. ల్యాబుల్లో బంగారు ఆభరణాలే కాదు.. వజ్రాభరణాలు కూడా తయారౌతున్నాయి. అమెరికన్ డైమండ్స్ పేరుతో అమ్ముడయ్యే ఈ వజ్రాల్ని శ్రీమంతులు సైతం వేలంవెర్రిగా కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతానికి ల్యాబ్ మేడ్ బంగారం తయారీ ఎక్కువగా పశ్చిమ బెంగాల్‌లో జరుగుతుంది. ల్యాబ్ మేడ్ గోల్డ్ తయారీ కేంద్రాలు హైదరాబాద్‌లో కూడా రావడం మొదలైంది. ధరలు ఇంకా దిగొస్తే.. అతి త్వరలో కృత్రిమ బంగారం వినియోగం దేశమంతా విస్తరించే అవకాశముంది. ఈవిధంగా మిడిల్‌క్లాస్ వారి గోల్డెన్ మెలోడీస్ గడిచిపోతున్నాయి. ఫ్యాషన్‌కి ఫ్యాషన్.. సెక్యూరిటీకి సెక్యూరిటీ.
ఎంతైనా బంగారం బంగారమే. గోల్డు నగలుకుండే వగలు గిల్టు నగలుకు రావు గాక రావు. అందుకే.. ధరలు ఎంత పెరిగినా… బంగారంపై మనోళ్లకుండే మోజు, క్రేజు మాత్రం తగ్గదు. పసిడి కొనుగోళ్లకు బ్రేకులూ పడవు. ఎందుకంటే.. భారతీయ సంప్రదాయంలో బంగారానికి మహిళలిచ్చే ప్రయారిటీ ఆ రేంజ్‌లో ఉంటుంది మరి. ఏవైనా ఫంక్షన్లు, ఈవెంట్లు పడితే గోల్డ్ కొనుక్కోడానికి ప్రత్యేకంగా ఓ బడ్జెట్టే కేటాయిస్తారు. కష్టకాలంలో ఉపయోగపడుతుందన్న సెంటిమెంట్‌తో బంగారాన్ని ఇన్వెస్ట్‌మెంట్‌గా చూసేవాళ్లు మరికొందరు. అందుకే.. ధర పెరిగినా.. తగ్గినా కొనేవాళ్లు కొంటుంటారు.. అమ్మేవాళ్లు అమ్ముతుంటారు. ఇక్కడ భారీ పతనావస్థలు, పెద్దపెద్ద స్వర్ణయుగాలూ అంటూ ఏమీ ఉండవు. కాకపోతే బంగారం ధరల గురించి మాట్లాడుకోవడం అనేది ఒక ప్యాషన్.
గత ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఐతే.. పదిగ్రాముల బంగారం ధర రెండులక్షలకు చేరినా చేరొచ్చంటూ ఒక టాక్ వినిపిస్తే ఔనా.. అని నోరెళ్లబెట్టామే తప్ప.. లోపలికెళ్లి లాజిక్కులు వెతుక్కోలేదు. ఇరవై ముప్పై ఏళ్ల నుంచి డేటా తీసుకుని బంగారం ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంటూ ట్రెండ్ ఎనాలసిస్ చేయడం బులియన్ మార్కెట్లో కామన్. కానీ.. ఈ ట్రెండ్ అనేది స్టాక్ మార్కెట్లకైతే వర్కవుటౌతుంది. బంగారం విషయంలో ట్రెండూ గిండూ జాన్తా నై అనీ, గోల్డ్ అనేది సైకలాజికల్ ఫ్యాక్టర్ అని చెబుతారు. అందుకే.. ధర ఎంత పెరిగినా కొనుగోలు విషయంలో వెనక్కి తగ్గబోడు సగటు వినియోగదారుడు. అప్పో సప్పో చేసైనా సరే.. బంగారం మీద తనకుండే మమకారాన్ని చాటుకుంటాడు. తులం లక్షైనా లక్షన్నరైనా.. మనోళ్లది అదే దూకుడు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి