ప్రస్తుతం మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ ఉంది. దీనిని ఆదరించే వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా స్కూటర్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. అయితే ఈ-బైక్ ల విషయానికి వస్తే మార్కెట్లో వీటి సంఖ్య కాస్త తక్కువే. ఇప్పుడిప్పుడే ఈ-బైక్స్ ను కంపెనీలు మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ఈ-బైక్ సెగ్మెంట్లో మన దేశంలోనే టాప్ బ్రాండ్ రీవోల్ట్ మోటార్స్. దీని నుంచి వస్తున్న బైక్స్ మార్కెట్లో ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. కాగా ఇప్పుడు ఇదే బ్రాండ్ నుంచి మరో ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ అయ్యింది. దీని పేరు రీవోల్ట్ ఆర్‌వీ1. ఇది రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. ఆర్‌వీ1, ఆర్‌వీ1 ప్లస్. వీటి ధరలు వరుసగా రూ. 84,990, రూ. 99,990. ఈ ధరలు ఎక్స్ షోరూం. పెట్రోల్ బైక్ నడపాడానికి అవసరమయ్యే ఖర్చులో కేవలం 5శాతంతో ఈ ఈ-బైక్ నడపవచ్చని రీవోల్ట్ కంపెనీ ప్రకటించింది. అంటే దాదాపు 95శాతం రన్నింగ్ కాస్ట్ మిగులుతుందని చెబుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
రీవోల్ట్ తీసుకొచ్చిన ఈ కొత్త బైక్లో ఎలక్ట్రిక్ బైక్ మిడ్-మోటార్, చైన్ డ్రైవ్ సిస్టమ్ ఉంటుంది. ఈ బైక్ రెండు బ్యాటరీ ఆప్షన్లతో వస్తోంది. ఒకటి 2.2కేడబ్ల్యూహెచ్ ఇది 100కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. మరొకటి 3.24కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఇది 160 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఆర్‌వీ1 ప్లస్ లో ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ ఉంటుంది. ఇది కేవలం 1.5 గంటల్లో బ్యాటరీని చార్జ్ చేస్తుంది. దీని పేలోడ్ సామర్థ్యం 250 కిలోలుగా ఉంది. దీని గరిష్ట వేగం గంటకు 75కిలోమీటర్లు. ఓలా నుంచి ఇటీవల వచ్చిన రోడ్ స్టర్ సిరీస్ లోని రోడ్ స్టర్ ఎక్స్ బైక్ కి పోటీగా ఉండనుంది.
ఈ కొత్త ఈ-బైక్లో ఎల్ఈడీ హెడ్ లైట్స్ ఉంటాయి. ఆరు అంగుళాల డిజిటల్ ఎల్సీడీ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయల్ డిస్క్ బ్రేక్స్ వంటివి ఉంటాయి. ఈ బైక్ భారీ టైర్లతో వస్తుంది. డిస్క్ బ్రేకులు ప్రయాణంలో భద్రతకు హామీనిస్తాయి. దీనిలో వివిధ రకాల డ్రైవింగ్ మోడ్స్ అందుబాటులో ఉంటాయి. స్పీడ్ మోడ్స్, రివర్స్ మోడ్స్ వంటి మల్టీ రైడింగ్ ఎక్స్ పీరియన్స్ ను అందిస్తుంది. రివర్స్ మోడ్ తో పార్కింగ్ సమయాల్లో ఇబ్బందులకు తొలగిస్తుంది.
ఈ కొత్త ఈ-బైక్ నాలుగు కలర్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. దీనికి సంబంధించిన బుకింగ్స్ కూడా ప్రారంభించినట్లు కంపెనీ ప్రకటించింది. రూ. 499 చెల్లించి ఈ బైక్ ను బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు త్వరలో ప్రారంభిస్తామని కంపెనీ ప్రకటించింది.
రీవోల్ట్ కొత్త ఈ-బైక్ లాంచ్ తో పాటు అదే సమయంలో ఆర్‌వీ400ని తీసుకొచ్చింది. మెరుగైన పెర్ఫామెన్స్, సేఫ్టీ ఫీచర్లను పరిచయం చేసింది. అలాగే ఫాస్ట్ చార్జింగ్ సదుపాయంతో 90 నిమిషాల్లోనే ఫుల్ చేసుకునే వెసులుబాటును కల్పించింది. దీనిలో కూడా రివర్స్ మోడ్, డిజిటల్ డిస్ ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు 160కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..