Reserve Bank Of India: బ్యాంకుల విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిబంధనలు మరింత కఠినతరం చేస్తోంది. సరైన నిబంధనలు పాటించని బ్యాంకులపై ఆర్బీఐ కొరఢా ఝుపిస్తోంది. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న బ్యాంకులపై ఇప్పటికే జరిమానాలు విధించింది ఆర్బీఐ. ఇక తాజాగా మరో సహకార బ్యాంకుకు భారీగా జరిమానా విధించింది. హిమాచల్‌లోని సోలాన్‌లో ఉన్న భగత్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకుకు ఎన్‌పీఏ (Non Performing Asset- NPA)కు సంబంధించిన విషయాలలో నిబంధనలు ఉల్లంఘించినందుకు రిజర్వ్ బ్యాంకు రూ.15 లక్షల జరిమానా విధించింది. అలాగే ఆర్బీఐ ఆదేశాలు పాటించనందున న్యూఢిల్లీకి చెందిన నగ్రిక్ సహకారి బ్యాంక్ లిమిటెడ్‌కు లక్ష రూపాయల జరిమానా విధిస్తున్నట్లు ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే తాము జరిమానా ఎందుకు విధించకూడదో తెలుపాలని కోరుతూ సహకార బ్యాంకుకు నోటీసులు జారీ చేసింది ఆర్బీఐ.
ఇటీవల డిపాజిటర్స్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్ స్కీమ్‌కు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించినందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ధనలక్ష్మి బ్యాంకుకు రూ.27.5 లక్షల జరిమానా విధించింది. ఇది కాకుండా గోరఖ్‌పూర్‌కు చెందిన రాష్ట్ర ప్రాథమిక సహకార బ్యాంకు ఆఫ్ ఈశాన్యకు కూడా జరిమానా విధించింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆర్బీఐ రూ.20 లక్షల జరిమానా విధించింది.
ఈ ఏడాది జూలై నెలలో సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్‌వర్క్‌తో సహా తన ఆదేశాలలోని కొన్ని నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆర్బీఐ యాక్సిస్ బ్యాంక్‌పై రూ.5 కోట్ల జరిమానా విధించింది. ఇదే కాకుండా జూలై నెలలో రుణాల పంపిణీకి సంబంధించిన కొన్ని నియమాలను ఉల్లంఘించినందుకు 14 బ్యాంకులకు ఆర్బీఐ జరిమానాలు విధించింది. ఇందులో దేశంలో అతిపెద్ద బ్యాంకింగ్ వ్యవస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఉంది.