
భారీ పెట్టుబడులతో AI రంగంలో భారత్‌ను ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో రిలయన్స్-జియో కొత్త దిశగా అడుగులు వేస్తోంది. దేశంలో మొబైల్ డేటా విప్లవం తీసుకొచ్చినట్లే, ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో కూడా పెద్ద మార్పులు తీసుకురావాలని సంకల్పించామని ముకేశ్ అంబానీ వెల్లడించారు. ఇందుకోసం వచ్చే ఏడు సంవత్సరాల్లో భారీగా రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించారు. దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన ఇండియా AI ఇంప్యాక్ట్ సమ్మిట్‌లో మాట్లాడిన ఆయన AI రంగంలో అసలైన ఉత్తమ దశ ఇంకా ముందుందని పేర్కొన్నారు. ఈ సాంకేతికత దేశాన్ని సుసంపన్న యుగంలోకి తీసుకెళ్లే శక్తి కలిగిందని చెప్పారు.
AI శక్తి కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతం అవుతుందా, లేక ప్రతి పౌరుడికి చేరుతుందా అన్నది కీలకం. దాన్ని ప్రజలందరికీ అందించేలా మేము పనిచేస్తాం అని ఆయన స్పష్టం చేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్, జియో కలిసి ఈ పెట్టుబడులను అమలు చేయనున్నట్లు తెలిపారు. ఇది కేవలం వ్యాపార విస్తరణ కోసం కాదని, దేశ నిర్మాణానికి దోహదపడే దీర్ఘకాలిక ప్రణాళిక అని అంబానీ పేర్కొన్నారు.
ఇంటర్నెట్ యుగంలో భారత్‌ను జియో అనుసంధానం చేసినట్లే, ఇప్పుడు ఇంటెలిజెన్స్ యుగంలో కూడా కీలక పాత్ర పోషించాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. ప్రతి పౌరుడు, ప్రతి రంగం AI ప్రయోజనాలు పొందేలా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంపై జియో దృష్టి పెట్టిందని వెల్లడించారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి