Realme 5G Smartphones: మొబైల్ వినియోగదారులను ఆకట్టుకునేందుకు పలు మొబైల్ తయారీ కంపెనీలు రకరకాల స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. అత్యాధునిక ఫీచర్స్‌ను జోడిస్తూ కస్టమర్లను మరింతగా ఆకట్టుకుంటూ అతి తక్కువ ధరల్లోనే అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. తాజాగా రియల్‌మీ కూడా మార్కెట్లో దూసుకుపోతోంది. రియల్‌మీ 5జీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌పై పట్టు సాధించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇప్పటికే ఇండియాలో తక్కువ ధరకే 5జీ స్మార్ట్ఫోన్లను విడుదల చేస్తోంది. త్వరలో మరిన్ని 5జీ మొబైల్స్ రిలీజ్ చేసేందుకు కసరత్తు చేస్తోంది రియల్‌మీ. ఇక భారత్‌లో రూ.10వేల లోపే 5జీ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకువస్తామంటోంది రియల్‌మీ. అలాగే ఇకపై రియల్‌మీ నుంచి రూ.15వేలపై రాబోయే స్మార్ట్‌ఫోన్‌లన్నీ 5జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తాయని రియల్‌మీ చెబుతోంది. ఇప్పటికే రియల్‌మీ నుంచి ఇండియాలో రియల్‌మీ నార్జో 30 5జీ, రియల్‌మీ 8 5జీ, రియల్‌మీ ఎక్స్7 మ్యాక్స్ 5జీ, రియల్‌మీ నార్జో 30 ప్రో 5జీ లాంటి మొబైల్స్ ఉన్నాయి.
2021 సంవత్సరంలో భారత్‌లో 5జీ లీడర్‌గా మారడమే మా లక్ష్యమని రియల్‌మే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) మాధవ్ షేఠ్ వెబినార్‌లో తెలిపారు. ప్రీమియం కస్టమర్ల నుంచి సాధారణ యూజర్ల వరకు అందరికీ ఈ టెక్నాలజీని అందిస్తామని చెప్పారు. రానున్న రోజుల్లో రియల్‌మీ జీటీ సిరీస్ స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేయడం తమ 5జీ వ్యూహంలో భాగమని మాధవ్ షేఠ్ పేర్కొన్నారు. రియల్‌మీ జీటీ సిరీస్‌లో ఒక ప్రొడక్ట్ మాత్రమే కాదని, చాలా మోడల్స్ ఉంటాయని అన్నారు.
రియల్‌మీ జీటీ స్మార్ట్‌ఫోన్ త్వరలో భారత్‌లో విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ మొబైల్ ఈ ఏడాది మార్చిలో చైనాలో విడుదల కాగా, ఆ తర్వాత యూరప్, రష్యా, థాయ్‌ల్యాండ్‌లో జూన్‌లో విడుదలైందన్నారు. రియల్‌మీ జీటీ స్మార్ట్‌ఫోన్‌తో పాటు నార్జో లైనప్‌లో మరిన్ని 5జీ స్మార్ట్‌ఫోన్లు కూడా రానున్నట్లు చెప్పారు.
అయితే రియల్‌మీ చెబుతున్నట్టుగా రూ.10 వేలలోపు 5జీ స్మార్ట్‌ఫోన్ ఎప్పుడు వస్తుందన్న స్పష్టత లేదు. రూ.7,500 ధరకే 5జీ మొబైల్ తీసుకొస్తామని కొద్ది రోజుల క్రితమే రియల్‌మీ సీఈఓ మాధవ్ షేఠ్ తెలిపిన సంగతి తెలిసిందే. భారత్‌లో రూ.20 వేల లోపు, రూ.15 వేల లోపు మొదటి 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసిన ఘనత రియల్‌మీదే. మరి రూ.10 వేల లోపు 5జీ స్మార్ట్‌ఫోన్ తీసుకొస్తే ఆ రికార్డు కూడా రియల్‌మీదే అవుతుంది.