RBI KYC Norms: కేవైసీ విషయంలో ఆర్‌బీఐ షాకింగ్ నిర్ణయం.. డాక్యుమెంట్స్ సమస్య ఫసక్
గత దశాబ్ద కాలంలో బ్యాంకింగ్ రంగంలో దేశంలో కీలక మార్పులు వచ్చాయి. ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరికీ బ్యాంకు అకౌంట్ తీసుకోవడం అనేది సర్వసాధారణంగా మారింది. ప్రభుత్వాలు కూడా సంక్షేమ ఫలాలను బ్యాంకు ఖాతాలకు జమ చేస్తున్నాయంటే బ్యాంకు ఖాతాలు ఏ స్థాయిలో ప్రజాదరణ పొందాయో? అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ బ్యాంకు ఖాతాలో చిన్నచిన్న సవరణలకు కూడా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ముఖ్యంగా సవరణలకు అనుగుణంగా డాక్యుమెంట్స్ సమర్పించడం వినియోగదారులకు చాలా పెద్ద సమస్య తెచ్చిపెడుతుంది.

బ్యాంకుల్లో కొత్త కస్టమర్లను చేర్చుకోవడం, గుర్తింపు పత్రాలను అప్‌డేట్ చేయడం రెండింటినీ సులభతరం చేయడం లక్ష్యంగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ తన నో యువర్ కస్టమర్ (కేవైసీ) నిబంధనలను సవరించింది. ముఖ్యంగా చిన్న చిన్న మార్పులకు కూడా డాక్యుమెంట్స్ అవసరమవుతున్న ప్రస్తుత పరిస్థితి నుంచి కేవలం సెల్ఫ్ అటెస్టేషన్‌తోనే బ్యాంకు ఖాతాలోని వివరాలను మార్చుకునే అవకాశం ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఇకపై బ్యాంకుల్లో కస్టమర్లు తమ చిరునామా మార్పు కోసం కేవలం సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ ఇస్తే సరిపోతుందని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. సెల్ఫ్ అటెస్టెడ్ కాపీని రిజిస్టర్డ్ ఈ-మెయిల్, మొబైల్ నంబర్లు, ఏటీఎంలు, ఆన్‌లైన్ బ్యాంకింగ్ అప్లికేషన్‌లతో సహా వివిధ డిజిటల్ ఛానెల్‌ల ద్వారా సమర్పించవచ్చు.
ముఖ్యంగా బ్యాంకు ఖాతాలకు డాక్యుమెంటేషన్‌ను తగ్గించాలనే లక్ష్యంతో ఈ చర్య తీసుకున్నామని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ఒక కస్టమర్ ఒక ఆర్థిక సంస్థకు ఓ సారి ఆ పత్రాలను అందించిన తర్వాత వారిని మళ్ళీ అదే డాక్యుమెంట్లను అడిగే అవసరం ఉండకూడదని పేర్కొన్నారు. ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన గత మార్చిలో పేర్కొన్నారు. ఆర్‌బీఐ కూడా కాలానుగుణ కేవైసీ అప్ డేట్స్ కోసం విస్తృత ఎంపికలను విస్తరిస్తోంది. వీటిని కస్టమర్ ఖాతా కలిగి ఉన్న బ్యాంకునకు సంబంధించిన ఏదైనా శాఖలో లేదా ఆర్థిక సంస్థ కార్యాలయంలో పూర్తి చేయడానికి వీలు కల్పిస్తుంది.
అలాగే వినియోగదారులు ఆధార్ ఓటీపీ ఆధారిత ఈ-కేవైసీ, వీడియో ఆధారిత కస్టమర్ గుర్తింపు ప్రక్రియ ద్వారా చేయవచ్చని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ఆధార్ బయోమెట్రిక్ ఈ-కేవైసీని ఉపయోగించే కస్టమర్‌లు వారి ప్రస్తుత చిరునామా యూఐడీఏఐ డేటాబేస్‌లో ఉన్న చిరునామాకు భిన్నంగా ఉంటే సెల్ప్ అటెస్టేషన్ ద్వారా మార్చుకోవచ్చు. ఈ అప్‌డేటెడ్ నిబంధనలతో ఇకపై కస్టమర్లకు కేవైసీ కష్టాలు ఉండవని బ్యాంకింగ్ రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








