
ప్రస్తుతం బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి, ద్రవ్యోల్బణం, అమెరికా డాలర్‌ను అరికట్టేందుకు పలు దేశాలు చేస్తున్న ప్రయత్నాలతో బంగారం ధరకు రెక్కలొచ్చాయి. కేవలం ఒక్క ఏడాది కాలంలోనే బంగారం ధర 70 శాతం పెరిగింది. ప్రస్తుతం తులం బంగారం ఏకంగా లక్షన్నర ఉంది. ధర పెరుగుదల పెరుగుతున్నా ప్రపంచంలోని చాలా దేశాలు బంగారాన్ని భారీగా నిల్వ చేసుకుంటున్నాయి. కొంతకాలంగా ఆర్బీఐ కూడా బంగారం నిల్వలను భారీగా పెంచుకుంది. కొంతకాలంగా బంగారం కొనుగోళ్లు తగ్గించినప్పటికీ ఆర్బీఐ వద్ద భారీగా బంగారం ఉంది.
ఆర్బీఐ లెక్కల ప్రకారం మార్చి 2025 నాటికే ఆర్బీఐ వద్ద ఏకంగా 879.59 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. అయితే ఇంత బంగారం ఆర్బీఐ ఎక్కడ నిల్వ చేస్తుందనే డౌట్ చాలా మందికి రావొచ్చు. ఇంకెక్కడ ఆర్బీఐలోనే ఉంటుందని, మన దేశంలోనే ఉంటుందని చాలా మంది అనుకుంటారు. కానీ, కాదు ఆర్బీఐ బంగారం అంతా భారతదేశంలో లేదు. అందులో దాదాపు 512 టన్నులు భారతదేశంలోనే ఉన్నాయి. మిగిలిన బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ (BIS) వద్ద భద్రంగా ఉంచారు. కొంత బంగారాన్ని బంగారు నిక్షేపాల రూపంలో కూడా ఉంచారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు కూడా గత కొన్ని సంవత్సరాలుగా భారీగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. డిసెంబర్ 2025 నాటికి ప్రపంచ కేంద్ర బ్యాంకులు మొత్తం 32,140 టన్నుల బంగారాన్ని కలిగి ఉన్నాయి. సెంట్రల్ బ్యాంక్ నిల్వలలో డాలర్ తర్వాత బంగారం ఇప్పుడు రెండవ అతి ముఖ్యమైన ఆస్తిగా మారింది. దీని వాటా 20 శాతానికి చేరుకుంది, యూరో (16 శాతం)ని కూడా అధిగమించింది. ఆసక్తికరంగా సెంట్రల్ బ్యాంకులు ఇప్పుడు US ట్రెజరీ బాండ్ల కంటే ఎక్కువ బంగారాన్ని కలిగి ఉన్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి