
Indian Railway: హైస్పీడ్ వందే భారత్ స్లీపర్ రైళ్ల ప్రారంభానికి కేంద్ర ప్రభుత్వం సిద్దమైంది. ఈ నెలలోనే దేశంలో తొలి ట్రైన్ పరుగులు తీయనుంది. మరో 10 రోజుల్లో ప్రధాని మోదీ పచ్చజెండా ఊపి ప్రారంభోత్సవం చేస్తారని ఇప్పటికే రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. గువహతి నుంచి హౌరా మధ్య తొలి వందే భారత్ స్లీపర్ ట్రైన్ ప్రారంభించనుండగా.. దీనికి సంబంధించిన ఛార్జీల వివరాలను కూడా విడుదల చేసింది. వందే భారత్ రైళ్లకు ప్రజల నుంచి మంచి ఆదరణ రావడంతో.. స్లీపర్ రైళ్లను కూడా తీసుకురావాలని ప్రభుత్వం భావించింది. అందులో భాగంగా మేకిన్ ఇండియాలో భాగంగా స్లీపర్ రైళ్లను స్వదేశంలోనే అభివృద్ది చేసింది.
ఈ ఏడాదిలో మొత్తం 12 వందే భారత్ స్లీపర్ రైళ్లను రైల్వేశాఖ ప్రవేశపెట్టనుందని అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. 2026 చివరి నాటికి వీటిని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే రైళ్ల ఉత్పత్తిని పెంచామని, ఈ ఏడాదిలోనే ఇవి అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఈ స్లీపర్ రైళ్లు వెయ్యి నుంచి 1500 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయనున్నాయి. ఈ రైళ్లల్లో అత్యాధునిక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. రాత్రుల్లో ప్రయాణం చేసేవారికి ఇవి సరికొత్త అనుభూతిని అందించనున్నాయి. 16 కోచ్‌లు అందుబాటులో ఉండనుండగా.. వీటిల్లో 13 త్రీటైర్ ఏసీ కోచ్‌లు, 4 సెకండ్ టైర్, ఫస్ట్ టైర్ ఒకటి ఉండనున్నాయి.
-16 కోచ్‌లు
-823 మంది ప్రయాణికులు వెళ్లగలిగే సామర్థ్యం
-గంటకు 180 కిలోమీటర్ల స్పీడ్
-మెరుగైన కుషనింగ్ బెర్త్ లు
-ఆటోమెటిక్ సెన్సార్‌తో కూడిన డోర్లు
-శబ్దం, కుదుపులు లేకుండా ప్రయాణం
-భద్రత కోసం కవచ్ వ్యవస్థ, ఎమర్జెన్సీ టాక్ బ్యాక్ సిస్టమ్
-పారిశుద్ద్యాన్ని నిర్వహించడానికి క్రిమీసంహారక టెక్నాలజీ
-అధునాతన నియంత్రణలు, భద్రతా వ్యవస్థలతో డ్రైవర్ క్యాబ్
-ఆటోమేటిక్ ఓపెనింగ్ డోర్లు