
తిరుమల శ్రీవారి దర్శనానికి తరచూ లక్షలాదిమంది భక్తులు వెళ్తుంటారు. వీరిలో ఎక్కుమంది రైళ్ల ద్వారా తిరుపతికి చేరుకుని అక్కడ నుంచి బస్సులు, ఇతర వాహనాల ద్వారా కొండపైకి చేరుకుంటారు. అయితే తిరుమల వెళ్లే భక్తులకు రైల్వేశాఖ అలర్ట్ జారీ చేసింది. రైల్వేశాఖ తిరుపతి వైపు వెళ్లే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రైల్వే మౌలిక సదుపాయాల విస్తరణ పనుల్లో భాగంగా ఈ మార్గంలో పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి అందుకనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. ముఖ్యంగా తిరుపతి వైపు వెళ్లేవారు ఈ విషయం తెలుసుకోవాల్సిన అవసరముంది.
చెన్నై సెంట్రల్-తిరుపతి మధ్య ప్రయాణించే సప్తగిరి ఎక్స్‌ప్రెస్ ఈ నెల 26, 28వ తేదీల్లో రద్దు చేశారు. ఉదయం 6.30 గంటలు, మధ్యాహ్నం 2.24 గంటల ఎక్స్‌ప్రెస్ రద్దు చేశారు. చెన్నై సెంట్రల్-తిరుపతి మధ్య ప్రయాణించే 4.35 గంటల ఎక్స్‌ప్రెస్ రైలును ఈ నెల 26న రద్దు చేయగా.. తిరుపతి-చెన్నై సెంట్రల్ మధ్య తిరిగే ఉదయం 10.10 గంటల రైలును ఈనెల 26,28వ తేదీలలో రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఇక తిరుపతి-చెన్నై సెంట్రల్ మధ్య సర్వీసులు అందిస్తున్న ఉదయం, సాయంత్రం 6.05 గంటల ట్రైన్‌ను ఈనెల 26న రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. తమిళనాడులోని అరక్కోణం యార్డ్ విస్తరణ పనులను రైల్వేశాఖ చేపడుతోంది. దీని కారణంగా ఈ రైళ్లను రద్దు చేశారు.
అరక్కోణం, చెన్నై సెంట్రల్, తిరుత్తణి సెక్షన్లలో సర్వీసులు అందిస్తున్న 47 సబర్బన్ రైళ్ల రాకపోకల్లో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. తిరువళంగడు వద్ద కొన్ని రైళ్లను షార్ట్ టెర్మినేట్ చేస్తున్నారు. అటు ముస్తాబాద్ – గన్నవరం మధ్య ట్రాక్ పనులు జరుగుతున్నాయి. దీని కారణంగా బెంగళూరు – గువాహటి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12509) జూన్ 17, 24 తేదీల్లో దారి మళ్లించారు. ఇది ఆయా రోజుల్లో విజయవాడ, గుడివాడ, నిడదవోలు మీదుగా వెళ్లనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. ఇక దాదర్-తిరునెల్వేలి ఎక్స్‌ప్రెస్ జూన్ 23,24వ తేదీలలో విరుదు నగర్ వరకు మాత్రమే వెళ్లనుంది. ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్‌లో మారిన షెడూల్స్ వివరాలను ప్రయాణికులు గమనించాలని రైల్వేశాఖ సూచించింది.