ఆర్థిక లావాదేవీల్లో ప్రస్తుతం వస్తున్న మార్పులతో ఒక్కొక్కరికి ఒకటి కంటే ఎక్కువ పొదుపు ఖాతా(Saving Accounts)లు ఉండటం సర్వ సాధారణం అయిపోయింది. తరచూ తరుచూ ఉద్యోగం మారేవారికి ఒకటి కంటే ఎక్కువ పొదుపు ఖాతాలు ఉండే అవకాశం ఉంది. అదే విధంగా వ్యక్తిగత సేవింగ్స్(Personal Savings) కోసం, ప్రభుత్వం నుంచి లభించే రాయితీలను పొందేందుకు ఇలా వివిధ కారణాలతో ఖాతాలను తెరుస్తుంటారు. అయితే వాటిని ఎంత వరకు సమర్థంగా నిర్వహిస్తున్నామనేది ప్రధాన అంశం. బ్యాంకు ఖాతా తెరిచే ముందు, ఆ ఖాతాను ఎందుకు తెరుస్తున్నామనే ప్రశ్నకు కచ్చితమైన సమాధానం ఉండాలి. తీసుకున్న ప్రతీ బ్యాంకు ఖాతాకు ఒక ప్రత్యేకమైన ప్రయోజనం ఉండాలి. ఆదాయం, ఖర్చులు, పెట్టుబడులకు సంబంధించిన అవసరాలకు మూడు పొదుపు ఖాతాలు సరిపోతాయి. ఉదాహరణకు, మీ శాలరీ ఖాతా మీకు వచ్చే ఆదాయాన్ని చూపిస్తుంది. నిత్యావసర వస్తువులు, అద్దె, బిల్లులు చెల్లించేందుకు ఒక ఖాతా నిర్వహించవచ్చు. నెలవారీ పద్ధతిలో పొదుపు, పెట్టుబడులు చేసేందుకు మూడో ఖాతాను ఉపయోగించుకోవచ్చు.
పొదుపు ఖాతాలో అన్ని బ్యాంకులు అన్ని రకాల సేవలను ఉచితంగా అందించవు. ఈ ఖాతాకు అందించే సేవలకు బ్యాంకులు రుసుము విధిస్తాయి. సాధారణంగా, పొదుపు ఖాతాలో నెలవారీ సగటు బ్యాలెన్స్ నిర్వహించాలి. ఈ కనీస బ్యాలెన్స్ నిర్వహించడంలో విఫలం అయితే అపరాధ రుసుము చెల్లించాల్సి వస్తుంది. ఎక్కువ ఖాతాలు ఉన్నట్లయితే ప్రతి ఖాతాలోనూ నిర్ణీత బ్యాలెన్స్ ఉంచాలి. కాబట్టి, ఎక్కువ మొత్తం ఖాతాలో లాక్ అయ్యి ఉంటుంది. పిల్లల విద్య, పదవీవిరమణ నిధి వంటి లక్ష్యాల కోసం జాయింట్ ఖాతాను తీసుకోవచ్చు. ఒకవేళ ఇరువురి ఆర్థిక పరిస్థితి వేరుగా ఉంటే భవిష్యత్తులో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇరువురూ వేరు వేరు ఖాతాలు తీసుకోవడం మంచిది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఖాతాలో డబ్బు ఉంచి, మర్చిపోతే, ఇక ఆ మొత్తాన్ని కోల్పోయినట్లే. ఎందుకంటే డెబిట్ కార్డు(Debit card), ఇతర సేవా రుసుములను ఆ ఖాతాలో ఉన్న మొత్తం నుంచి తీసుకుంటారు. ఇటువంటి నిరుపయోగమైన ఖాతాల వల్ల మీతో పాటు నామినీ కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది.
చాలా వరకు బ్యాంకులు ఈ మధ్య ఆన్లైన్ లోనే ఖాతాలు తెరిచే సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. అయితే, ఆన్లైన్(Account opening in Online) లో ఖాతా మూసే వీలు మాత్రం ఉండదు. నేరుగా బ్యాంకుకు వెళ్లి అక్కడ సంబంధిత ఫోరమ్ నింపి, ఖాతాలో ఉన్న బ్యాలన్స్ ని మీ ఇతర ఖాతాకు బదిలీ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తరవాత కొద్ది రోజులకి ఖాతా మూసివేయబడుతుంది. అవసరాలకు అనుగుణంగా, ఖాతాలను తీసుకోవడంలో తప్పు లేదు. అయితే, వీలైనంత వరకూ వేతన ఖాతాకు తోడుగా మరో ఖాతాను తీసుకోవడం మంచిది. తప్పదు అనుకుంటేనే మూడో ఖాతా తీసుకోవాలి. జాయింట్ ఖాతా ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా ఒక ఖాతా ఉండడం మంచిది. ఖాతాలకు ఆధార్ నెంబరు(Aadhar), పాన్ అనుసంధానించండి. వేతన ఖాతాలో మీ వేతనానికి సంబంధించిన లావాదేవీలనే నిర్వహించండి. ఒక సంస్థ నుంచి వేరొక సంస్థకు మారినప్పుడు, కొత్త సంస్థ శాలరీ ఖాతా తెరిస్తే, మీ పాత సంస్థ వారు ఇచ్చిన శాలరీ ఖాతా రద్దు చేయడం మర్చిపోకండి. వాడకంలో లేని ఖాతాలను వీలైనంత వెంటనే రద్దు చేసుకోండి.