
నేటి అనిశ్చిత ఆర్థిక పరిస్థితుల్లో సామాన్యులు తమ కష్టార్జితాన్ని భద్రంగా దాచుకోవడంతో పాటు ప్రతి నెలా కొంత స్థిరమైన ఆదాయం రావాలని కోరుకుంటున్నారు. పెట్టుబడి పెట్టేందుకు మార్కెట్లో ఎన్నో మార్గాలు ఉన్నప్పటికీ, సామాన్యులు ఇప్పటికీ సురక్షితమైన మరియు స్థిరమైన రాబడినిచ్చే పథకాలనే కోరుకుంటారు.అటువంటి వారి కోసం పోస్ట్ ఆఫీస్‌లో ఎన్నో అద్భుత పథకాలు ఉన్నాయి. అందులో పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ మంచి ఆప్షన్. ఒక్కసారి పెట్టుబడి పెడితే ఐదేళ్ల పాటు పెన్షన్ లాంటి నెలవారీ ఆదాయాన్ని ఈ పథకం అందిస్తుంది.
ఇది కేంద్రం మద్దతు ఉన్న సురక్షితమైన పొదుపు పథకం. ముఖ్యంగా పదవీ విరమణ చేసిన వారు, మహిళలు, రిస్క్ లేకుండా నెలవారీ ఆదాయం కోరుకునే వారికి ఇది అత్యంత ప్రయోజనకరం. ఈ పథకంలో ప్రస్తుతం 7.4శాతం వడ్డీ రేటు అమలవుతోంది. ఐదేళ్ల కాలపరిమితి వరకు ఈ వడ్డీ రేటులో ఎటువంటి మార్పు ఉండదు.
ఈ పథకంలో సింగిల్ లేదా జాయింట్ అకౌంట్ తెరిచే అవకాశం ఉంది. సింగిల్ అకౌంట్ అయితే గరిష్టంగా రూ. 9 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. జాయింట్ అకౌంట్ అయితే భార్యభర్తలు లేదా ముగ్గురు వ్యక్తులు కలిసి ఖాతా తెరవచ్చు. ఇందులో గరిష్టంగా రూ. 15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. కేవలం రూ.1,000 తో కూడా ఈ ఖాతాను ప్రారంభించవచ్చు.
మీరు పెట్టే పెట్టుబడి ఆధారంగా ప్రతి నెలా మీకు అందే వడ్డీ మారుతుంటుంది. ఉదాహరణకు మీరు రూ. 3 లక్షలు డిపాజిట్ చేస్తే..నెలకు సుమారు రూ.1,850 వడ్డీ లభిస్తుంది. రూ.9 లక్షలు డిపాజిట్ చేస్తే.. నెలకు సుమారు రూ.5,550 వడ్డీ లభిస్తుంది. అదే రూ.15 లక్షలు డిపాజిట్ చేస్తే: ప్రతి నెలా రూ.9,250 మీ చేతికి అందుతాయి.
ఈ పథకం ఐదేళ్ల వరకు కొనసాగుతుంది. గడువు ముగిసిన తర్వాత మీ అసలు మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు.
వడ్డీ డబ్బులు నేరుగా మీ ఖాతాలో పడాలంటే పోస్టాఫీసులో సేవింగ్స్ అకౌంట్ కలిగి ఉండాలి.
ఖాతా తెరవడానికి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు అవసరం.
మీ సమీపంలోని పోస్టాఫీసును సందర్శించి అప్లికేషన్ ఫారమ్ నింపడం ద్వారా సులభంగా ఈ ఖాతాను ప్రారంభించవచ్చు. ప్రభుత్వ హామీ ఉండటం వల్ల మీ డబ్బుకు పూర్తి భద్రత ఉంటుంది.