భారతీయ రైల్వే చరిత్రలో మరో అరుదైన ఘట్టానికి నాంది పడనుంది. దేశంలోనే తొలి ర్యాపిడ్ ఎక్స్ రైలు ప్రారంభం కానుంది. ఈ హైస్పీడ్ ప్రాంతీయ రైలును శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ తొలి ప్రాంతీయ హైస్పీడ్ రైలు గంటకు 160 కి.మీల వేగంతో దూసుకుపోతుంది. ఢిల్లీ-ఘజియాబాద్ రీజినల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (RRTS) కారిడార్‌లో సాహిబాబాద్-దుహై డిపో మధ్య ఈ రైలు ప్రయాణించనుంది.
అక్టోబర్ 20వ తేదీన ప్రధాని ఈ రైలును ప్రారంభిస్తుండగా, అక్టోబర్ 21వ తేదీ నుంచి ప్రయాణికులకు సేవలు అందుబాటులోకి రానున్నాయి. సాహిబాబాద్, దుహై డిపోల మధ్య ఉన్న 17 కి.మీల మార్గంలో ఈ ప్రాంతీయ హైస్పీడ్ రైలు ప్రయాణిస్తుంది. ఈ రైలు సాహిబాబాద్, ఘజియాబాద్, గుల్దర్, దుహై, దుహై డిపోల మీదుగా ప్రయాణిస్తుంది. అత్యాధునిక ఫీచర్లతో ఈ రైలును ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంతకీ ప్రాంతీయ హై స్పీడ్ రైలులో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ఈ రైలు ప్రత్యేకతలు ఏంటి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
ఈ రైళ్లు పూర్తిగా ఎయిర్ కండిషన్డ్‌తో రూపొందించారు. సీసీటీవీ కెమెరాలు, మర్జెన్సీ డోర్ ఓపెనింగ్ మెకానిజం, మొబైల్ ఛార్జింగ్ పాయింట్, మెట్రో విధంగా రూట్ మ్యాప్‌లు, హీటింగ్ వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్‌తో పాటు మరెన్నో అత్యాధునిక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ రైలు సర్వీసులు ఉంటాయి. ప్రతీ 15 నిమిషాలకు ఒక రైలు అందుబాటులో ఉంటుంది. ప్రతీ రైలులో మొత్తం 6 కోచ్‌లు ఉంటాయి.
ఈ రైలులో ఒకేసారి కూర్చొని, నిలబడి మొత్తం 1700 మంది ప్రయాణించచ్చు. స్టాండర్డ్ కోచ్‌లో మినిమం టికెట్ ధర రూ. 20, గరిష్ట ధర రూ. 50గా నిర్ణయించారు. ఇక ప్రీమియం కోచ్‌లో మినిమం ధర రూ. 40, మ్యాగ్జిమం ధర రూ. 100గా నిర్ణయించారు. స్టాండర్డ్ కోచ్‌లో మొత్తం 72 సీట్లు, ప్రీమియం కోచ్‌లో 62 సీట్లు ఉంటాయి. ప్రతీ రైలులో మహిళలకు ప్రత్యేకంగా ఒక కోచ్‌ను ఏర్పాటు చేశారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..