
దేశంలోని ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. పీఎఫ్ వేతన పరిమితిని రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించింది. దీని వల్ల కొత్తగా 51 లక్షల మంది ఉద్యోగులకు పీఎఫ్ ప్రయోజనాలు దక్కనున్నాయి. చివరిసారిగా 2014లో రూ.7500 నుంచి రూ.15 వేలకు పీఎఫ్ శాలరీ లిమిట్ పెంచారు. ఇప్పుడు 12 ఏళ్ల తర్వాత ఒకేసారి రూ.10 వేలు పెంచి రూ.25 వేలుగా నిర్ణయించారు. దీంతో రూ.25 వేల వరకు జీతం పొందేవారు తప్పనిసరిగా పీఎఫ్ పరిధిలోకి రానున్నారు. వారికి కూడా పెన్షన్, జీవిత బీమా ప్రయోజనాలు లభించనున్నాయి. అయితే పీఎఫ్ వేతన పరిమితి పెరగడం వల్ల ఉద్యోగులకు ఏయే లాభాలు ఉంటాయనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
పీఎఫ్ శాలరీ లిమిట్ రూ.25 వేలకు పెంచేందుకు బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. త్వరలోనే దీనిపై అధికారిక ఉత్తర్వులు జారీ కానున్నాయి. అయితే దీని వల్ల పెన్షన్లు, బీమా పరిమితి కూడా పెరిగే అవకాశముంది. పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి కేంద్రం పెన్షన్ సౌకర్యం కల్పిస్తున్న విషయం తెలిసిందే. పదేళ్ల సర్వీస్ పూర్తి చేసినవారికి 60 ఏళ్ల తర్వాత ప్రతీ నెలా పించన్ అందుతుంది. ఈ పించన్ ఎంత అందుతుందనేది మీ శాలరీని బట్టి ఉంటుంది. శాలరీ ఎక్కువ ఉంటే పెన్షన్ సొమ్ము ఎక్కువ అందుతుంది. ఇప్పుడు శాలరీ లిమిట్‌ను పెంచడం వల్ల పెన్షన్ సొమ్ము కూడా ఆటోమేటిక్‌గా పెరగనుంది. దాదాపు 67 శాతం వరకు పెన్షన్ సొమ్ము పెరిగే అవకాశం ఉంది. ఇక పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం లైఫ్ ఇన్సూరెన్స్ ప్రయోజనం అందిస్తోంది. ప్రస్తుతం దీని పరిమితి రూ.7 లక్షలుగా ఉండగా.. ఇప్పుడు రూ.10.50 లక్షలకు పెరుగుతుందని అంచనా. ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసిన తర్వాత దీనిపై స్పష్టత రానుంది.
ప్రస్తుతం ఉన్న రూ.15 వేల పరిమితి ఆధారంగా బీమా పరిమితిని నిర్ణయిస్తున్నారు. ఇప్పుడు రూ.25 వేలకు పెరగడం వల్ల బీమా సొమ్ము కూడా పెరుగుతుంది. ప్రస్తుత ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం ఉద్యోగి సర్వీసులో ఉన్నప్పుడు మరణిస్తే కనీసం రూ.2.5 లక్షలు, గరిష్టంగా రూ.7 లక్షలు కుటుంబసభ్యులకు అందుతుంది. అదే విధంగా పెన్షన్ కూడా పెరుగుతుంది. ప్రస్తుతం కనీస పెన్షన్ రూ.వెయ్యిగా ఉండగా.. జీతంను బట్టి ఈ లిమిట్ పెరుగుతుంది. ప్రస్తుతం కనీస పెన్షన్ రూ.వెయ్యిగా ఉండగా.. దీనిని రూ.5 వేలకు పెంచాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. కానీ కేంద్రం దీనిపై సముఖంగా లేదు. ఇప్పుడు శాలరీ లిమిట్ పెంచడం వల్ల పెన్షన్ కాంట్రిబ్యూషన్ కూడా పెరుగుతుంది. దీని వల్ల రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగులకు పెన్షన్ ప్రయోజనాలు లభించనున్నాయి.