
సేవింగ్స్ అకౌంట్స్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఇది ఎవరైనా తీసుకోవచ్చు. సేవింగ్స్ అకౌంట్‌లో మనం పొదుపు చేసుకునే డబ్బులపై వార్షిక వడ్డీ చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కువమందికి సేవింగ్స్ అకౌంట్ అనేది ఉంటుంది. ఇక కరెంట్ అకౌంట్ కూడా చాలామందికి ఐడియా ఉంటుంది. సేవింగ్స్ అకౌంట్‌లో డిపాజిట్, విత్ డ్రాలపై లిమిట్స్ ఉంటాయి. అదే కరెంట్ అకౌంట్‌లో ఎలాంటి లిమిట్స్ ఉండవు. వ్యాపారస్తులు. కంపెనీలు కరెంట్ అకౌంట్లు తీసుకుంటూ ఉంటాయి. ఇక శాలరీ అకౌంట్ గురించి మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. కొత్త ఉద్యోగంలో చేరినప్పుడు కంపెనీలు తమ ఉద్యోగులకు బ్యాంకులచే శాలరీ అకౌంట్ మంజూరు చేయిస్తాయి. ఈ అకౌంట్‌లోనే ఉద్యోగులకు జీతాలు జమ చేస్తాయి. ఈ శాలరీ అకౌంట్ ఉన్న ఖాతాదారులకు అనేక ప్రయోజనలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
సేవింగ్స్ అకౌంట్ ఉన్నవారు తమ ఖాతాలో మినిమం అమౌంట్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే బ్యాంకులు ఛార్జీలు విధిస్తాయి. అదే శాలరీ అకౌంట్ ఉన్నవారు తమ అకౌంట్ జీరో బ్యాలెన్స్ మెయింటైన్ చేసినా ఎలాంటి జరిమానాలు పడవు. ఇక ఈ అకౌంట్ ఉన్నవారికి ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ కూడా బ్యాంకులు కల్పిస్తున్నాయి. మీకు అత్యవసరంగా డబ్బులు అవసరమైనప్పుడు ఓవర్ డ్రాఫ్ట్ ద్వారా డబ్బులు తీసుకోవచ్చు.
ఇక శాలరీ అకౌంట్లపై తక్కువ వడ్డీకే బ్యాంకులు లోన్లు మంజూరు చేస్తాయి. హోమ్ లోన్స్, పర్సనల్ లోన్లను తక్కువ వడ్డీకే అందిస్తాయి. ఇక ఎలాంటి వార్షిక ఫీజులు లేకుండా శాలరీ అకౌంట్ ఉన్నవారికి ఉచిత క్రెడిట్ కార్డులను బ్యాంకులు ఆఫర్ చేస్తాయి. ఇక ఆన్‌లైన్ లావాదేవీలు, డైనింగ్‌పై రివార్డ్ పాయింట్లు, క్యాష్ బ్యాక్స్, డిస్కౌంట్లు కూడా ఎక్కువగా అందిస్తాయి.
శాలరీ అకౌంట్ ఉన్నవారు ఉచితంగా డిజిటల్ లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్ ట్రాన్సాక్షన్లపై ఎలాంటి ఛార్జీలు ఉండవు. ఇక ఏటీఎం లావాదేవీలపై కూడా ఎలాంటి ఛార్జీలు ఉండవు. ఇక ఈ అకౌంట్ ఉన్నవారికి యాక్సిడెంట్ డెత్, హెల్త్ ఇన్యూరెన్స్ వంటి సదుపాయాలు బ్యాంకులు కల్పిస్తున్నాయి. మీరు సేవింగ్స్ అకౌంట్‌ను శాలరీ అకౌంట్‌గా మార్చుకోవచ్చు. మీరు కొత్తగా ఉద్యోగంలో చేరినప్పుడు మీ సేవింగ్స్ అకౌంట్‌లో శాలరీ పడేలా చేసుకోవాలి. కొద్ది రోజులు తర్వాత మీ బ్యాంక్ ఆన్లైన్ వెబ్‌సైట్ లేదా యాప్‌లోకి వెళ్లి శాలరీ అకౌంట్‌గా మార్చుకోవచ్చు.