
క్రెడిట్ కార్డు యూజర్స్ పెరగడంతో క్రెడిట్ కార్డు స్కాములు కూడా పెరుగుతూ పోతున్నాయి. క్రెడిట్ కార్డులు వాడేవాళ్లను టార్గెట్ చేస్తూ సైబర్ నేరగాళ్లు కొత్తరకాల మోసాలకు పాల్పడుతున్నారు. వీటిలో ఫిషింగ్ స్కామ్, స్కిమ్మింగ్ స్కామ్, సిమ్ స్వాపింగ్, అప్లికేషన్ స్కామ్.. ఇలా చాలారకాలున్నాయి. వీటి బారిన పడకుండా సేఫ్ గా ఎలా ఉండాలంటే..
ఫిషింగ్ అంటే డేటా చోరీ అని అర్థం. మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్‌ను యాక్సెస్ చేసి తద్వారా క్రెడిట్ కార్డులో డబ్బు కొట్టేయడమే ఫిషింగ్ స్కామ్. కాల్ చేసి.. మీరు వాడుతున్న క్రెడిట్ కార్డు కంపెనీ నుంచి మాట్లాడుతున్నట్టుగా నమ్మించి లింక్స్ మీ డేటాను దొంగిలించే ప్రయత్నం చేస్తారు. వారి మాటలు నమ్మారంటే.. మీ క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ జీరో అవుతుంది. కొత్తగా క్రెడిట్ కార్డు తీసుకున్నవాళ్లు ఇలాంటి స్కామ్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలి.
ఈ కొత్త రకం స్కామ్ రీసెంట్ గా వెలుగులోకి వచ్చింది. దీనిపేరు సిమ్ స్వాపింగ్ స్కామ్. స్విఛాఫ్ లో ఉన్న ఫోన్లే వీళ్ల టార్గెట్. యాక్టివ్ గా లేని మొబైల్ నెంబర్ డీటెయిల్స్ తీసుకుని.. టెలికాం కంపెనీకి కాల్ చేసి.. ఫోన్ పోయిందని కొత్త సిమ్ కావాలని అడిగి.. మీ పేరు, ఆధార్ కార్డు డీటెయిల్స్ తో మీ నెంబర్ తో కొత్త సిమ్ తీసుకునే ప్రయత్నం చేస్తారు. దాంతో ఆ నెంబర్ తో లింక్ అయ్యి ఉన్న క్రెడిట్ కార్డులు, బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ స్కామర్ల చేతికి చిక్కినట్టే.. కాబట్టి ఇలాంటి మోసాల బారిన పడకూడదంటే మొబైల్ లేదా సిమ్‌ను ఎక్కువరోజులు స్విఛాఫ్ చేసి ఉంచకుండా చూసుకోవాలి. సిమ్ వెరిఫికేషన్ పేరుతో మెసేజ్‌లు వచ్చినా లేదా ఉన్నట్టుండి నెట్‌వర్క్ ఆగిపోయినా వెంటనే హెల్ప్ లైన్ కాల్ చేసి కంప్లెయింట్ చేయాలి.
క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసేవాళ్లను టార్గెట్ చేసుకుని స్కామర్లు స్కిమ్మింగ్ అనే స్కామ్ ద్వారా డబ్బు కొట్టస్తారు. పబ్లిక్ ప్లేసుల్లో ఉన్న స్వైపింగ్ మెషీన్స్‌ను హ్యాక్ చేసి.. అందులో మాల్వేర్ ఇన్‌స్టాల్ చేస్తారు. ఆ మెషీన్స్‌లో కార్డు స్వైప్ చేసినప్పుడు మీ కార్డు డేటాని హ్యాక్ చేసి కార్డులోని మనీని కాజేస్తారు. ఇలాంటి మోసాల బారిన పడకూడదంటే.. పబ్లిక్ ప్లేసుల్లో క్రెడిట్ కార్డుల్ని స్వైప్ చేయకుండా జాగ్రత్త పడాలి.
మీ పేరు, అడ్రెస్, ఆధార్ నెంబర్ , మొబైల్ నెంబర్.. ఇలాంటి డీటెయిల్స్ దొంగిలించి మీ పేరు మీద క్రెడిట్ కార్డు అప్లై చేస్తారు. ఒకవేళ అప్లికేషన్ యాక్సెప్ట్ అయితే కరెంట్ అడ్రెస్ కింద వేరే అడ్రెస్ పెట్టి.. కార్డు వాళ్లు తీసుకుంటారు. దీన్నే అప్లికేషన్ స్కామ్ అంటారు. ఈ స్కామ్ చాలా రేర్ గా జరుగుతుంది. దీనిబారిన పడకుండా ఉండాలంటే.. మీ డీటెయిల్స్ ను ఆన్ లైన్ లోఎక్కడా ఎంటర్ చేయకుండా జాగ్రత్తపడాలి.
ఇక వీటితోపాటు ఆన్‌లైన్‌లో లోన్స్ కోసం సెర్చ్ చేసేవాళ్లకు కాల్ చేసి.. లోన్స్ ఇస్తామని లింక్ పంపించడం, లేదా ఫేక్ వెబ్ సైట్స్ క్రియేట్ చేసి.. లోన్స్, క్రెడిట్ కార్డ్స్ అప్లై చేసే వాళ్లను బుట్టలో వేసుకోవడం వంటి స్కామ్స్ కూడా జరుగుతుంటాయి. కాబట్టి ఇలాంటి విషయాల పట్ల జాగ్రత్త వహించడం మంచిది. ఒకవేళ మీరు స్కామ్ కు గురైతే.. వెంటనే సైబర్ క్రైమ్ పోర్టల్ లో కంప్లెయింట్ చేయాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి