భారతీయులకు జీవితా బీమా అంటే టక్కున గుర్తు వచ్చేది ఎల్‌ఐసీ. సహజంగా చాలా మంది పొదుపు మంత్రం పాటిస్తారు. అయితే ఈ పొదుపును సహజంగా బీమా చెల్లింపుల రూపంలో చేస్తే కుటుంబానికి ఆర్థిక భద్రత ఉంటుందనే విషయంలో ఎక్కువ మంది ఎల్‌ఐసీను ఆదరించారు. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా అనేక కంపెనీలు బీమా మార్కెట్‌లోకి వచ్చినా ఎల్‌ఐసీ రారాజుగా నిలిచింది. ముఖ్యంగా ఖాతాదారులను ఆకట్టుకునేలా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్లాన్స్ లాంచ్ చేస్తూ ఉంటుంది. ప్రతి మనిషి అవసాన దశ అంటే వృద్ధాప్యంలో ఎవరిపై ఆధారపడకుండా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అందుకే ఒంట్లో సత్తువ ఉన్నప్పుడే పొదుపు చేసి ఆ సమయంలో వాడుకోవాలని అనుకుంటూ ఉంటాడు. అందుకని ముందు నుంచే వివిధ పథకాల్లో పెట్టుబడి పెడుతూ ఉంటారు. అయితే ఎల్‌ఐసీ ఇలాంటి వారిని ఆకట్టుకోవడనికి సరళ్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. ఈ యాన్యుటీ ప్లాన్‌లో నెలవారీ, త్రైమాసిక లేదా వార్షిక చెల్లింపులు చేయవచ్చు. ఎల్‌ఐసి తన పాలసీ డాక్యుమెంట్‌లో పాలసీ ప్రారంభంలో యాన్యుటీ రేట్లు హామీ ఇస్తాయి. పాలసీదారు జీవితకాలమంతా యాన్యుటీలు పొందవచ్చు. కాబట్టి ఎల్‌ఐసీ సరళ్ ప్లాన్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) కొత్త పెన్షన్ స్కీమ్ అంటే సరళ్ పెన్షన్‌తో ముందుకు వచ్చింది. ఇందులో పాలసీదారులు ఒకసారి ప్రీమియం చెల్లించడం ద్వారా జీవితాంతం పెన్షన్ పొందవచ్చు. అయితే ఈ పెన్షన్ పొందడానికి రెండు ఎంపికలు ఉన్నాయి. ఒకటి జీవితాంతం పింఛను పొందేందుకు ఉండగా మరొకటి చివరిగా జీవించి ఉన్న వ్యక్తి మరణించినప్పుడు కొనుగోలు చేసిన ధరలో 100 శాతం రాబడితో ఉమ్మడి జీవిత వార్షికాదాయంగా ఉంది.
మొదటి ఆప్షన్‌లో పాలసీదారు జీవించి ఉన్నంత వరకు యాన్యుటీ చెల్లింపులు బకాయిల్లోనే చేస్తారు. వ్యక్తి మరణించినప్పుడు యాన్యుటీ చెల్లింపులు వెంటనే ఆగిపోతాయి. అలాగే నామినీకి 100 శాతం డబ్బు చెల్లించవచ్చు.
రెండవ ఎంపికలో వ్యక్తి లేదా జీవిత భాగస్వామి జీవించి ఉన్నంత వరకు యాన్యుటీ మొత్తం బకాయిల్లో చెల్లిస్తారు. అయితే ఈ జాయింట్ లైఫ్ యాన్యుటీని జీవిత భాగస్వామితో మాత్రమే తీసుకోవచ్చు.
పాలసీని కొనుగోలు చేయడానికి కనీస వయస్సు 40 సంవత్సరాలుగా ఉంటుంది. అలాగే గరిష్ట వయస్సు 80 సంవత్సరాలుగా నిర్ణయించారు. సరళ్ పెన్షన్ కింద అందుబాటులో ఉన్న యాన్యుటీని భవిష్యత్తులో నెలవారీ, త్రైమాసికం లేదా వార్షికంగా చెల్లించవచ్చు. ఎల్‌ఐసి తన పాలసీ డాక్యుమెంట్‌లో పాలసీ ప్రారంభంలో యాన్యుటీ రేట్లు హామీ ఇస్తాయి. అలాగే పాలసీదారు జీవితకాలమంతా యాన్యుటీలు చెల్లిస్తారు.
60 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి రూ. 10 లక్షలు పెట్టుబడి పెట్టి, వార్షిక యాన్యుటీ మోడ్‌ను ఎంచుకుంటే అతనికి రూ.58,950 లభిస్తుంది. అయితే ఈ చెల్లింపులు వివిధ షరత్తులకు లోబడి ఉంటాయి. కాబట్టి ఈ వివరాల కోసం ఎల్‌ఐసీ అధికారిక వెబ్‌సైట్‌ను తనిఖీ చేయాలని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.
మరిన్ని పర్సనల్ ఫైనాన్స్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..