దీపావళిని దేశమంతా సంబరంగా జరుపుకుంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నిండాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు చేస్తారు. ఇంటిని ప్రత్యేకంగా అలంకరిస్తారు. గుమ్మం బయట వరుసగా దీపాలను ఉంచి డెకరేషన్ చేస్తారు. ఇక ఉద్యోగాల నిమిత్తం పెద్ద పెద్ద నగరాల్లో ఉండే వారైతే తమ సొంత ఊళ్లకు వెళ్లేందుకు సిద్దమవుతారు. కుటుంబ సభ్యులతో సరదాగా పండుగను జరుపుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. ఇదే అదనుగా భావించి కొన్ని ట్రావెల్స్ తమ బస్సుల ధరలను అమాంతం పెంచేస్తారు. ఇక ట్రైన్ సంగతైతే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కిక్కిరిసిపోతాయి. పండుగ సందర్భంగా ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినా సీటు దొరకడం పెద్ద సమస్యగా మారుతుంది. నేడు సమాజం మొత్తం ఆన్లైన్‌లోనే బస్సు, ట్రైన్ టికెట్లను బుక్ చేసుకుంటున్నారు. అందులో పేటీఎం దేశమంతటా అందుబాటులో ఉంది. ఈ యూపీఐ యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకునే వారికి దీపావళి కానుకగా బొనాంజా ఆఫర్ ప్రకటించింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
పేటీఎం ద్వారా బస్సు టికెట్ బుక్ చేసుకునే వారికి ప్రతి టికెట్ పై రూ. 500 రాయితీని అందిస్తోంది. ఇక ట్రైన్ టికెట్ విషయంలో కూడా ఈ రూల్ అమలవుతుందని తెలిపింది. దీంతో పాటూ ప్రయాణాన్ని అనివార్య కారణాల వల్ల రద్దు చేసుకుంటే పూర్తి స్థాయిలో డబ్బులు తిరిగి చెల్లించేలా మరో ఆఫర్ ను ప్రకటించింది. పేటీఎం ప్లాట్‌ఫాం నుంచి ట్రైన్ టికెట్ బుక్ చేసుకుని.. ఆ టికెట్‌ను ప్రయాణానికి అరగంట ముందు రద్దు చేసుకుంటే పూర్తి డబ్బులు తమ ఖాతాలో జమ చేసేలా కొత్త ఆఫర్ అందుబాటులోకి తెచ్చింది. ముందుగా రిజర్వేషన్ చేసుకున్న టికెట్లతో పాటూ తత్కాల్ కోటాలో బుక్ చేసుకున్న టికెట్లకు కూడా ఈ నిబంధన అమలవుతుందని తెలిపింది. డబ్బులు తిరిగి చెల్లించే క్రమంలో ఎలాంటి అదనపు ఫీజులు చెల్లించనవసరం లేదని స్పష్టం చేసింది. దీంతో తన ప్లాట్‌ఫాంను మరింత మంది ఎక్కువగా వినియోగించే వీలుందంటున్నారు నిపుణులు. ఈ ఆఫర్ కేవలం దీపావళి పండుగ వరకు మాత్రమే అమలవనుంది. తిరుగు ప్రయాణానికి వర్తించకపోవచ్చు. ఒక వేళ తిరుగు ప్రయాణాన్ని కూడా ముందుగానే రిజర్వేషన్ చేసుకుంటే ఈ ఆఫర్ వర్తించనుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..