Petrol: పెట్రోల్, డీజిల్ కొరత..! కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన.. వాహనదారులకు నో టెన్షన్

దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత అంటూ వస్తున్న వార్తలపై కేంద్ర పెట్రోలియం శాఖ స్పందించింది. ఈ మేరకు అధికారికంగా ఓ ప్రకటన జారీ చేసింది. దేశంలో రెండు నెలలకు సరిపడ నిల్వలు ఉన్నాయని, ఆందోళన అవసరం లేదని తెలిపింది. ప్రజలు భయపడవద్దని సూచించింది.

Petrol: పెట్రోల్, డీజిల్ కొరత..! కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన.. వాహనదారులకు నో టెన్షన్
Petrol Pump

Updated on: Mar 26, 2026 | 5:44 PM

దేశంలో పెట్రోల్, డీజిల్ నిల్వలపై కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పందించింది. దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత అంటూ సోషల్ మీడియా ప్రచారం జరుగుతుండటం, బంక్‌ల వద్ద వాహనదారులు క్యూలు కడుతుండటంపై కేంద్రం ప్రకటన చేసింది. దేశంలో ఇంధన సరఫరా పూర్తిగా సురక్షితంగా, స్థిరంగా ఉందని వెల్లడించింది. దేశంలో ఎక్కడా పెట్రోల్, డీజిల్, ఎల్‌పిజి కొరత లేదని, అన్ని రిటైల్ అవుట్‌లెట్‌లు తగినంత సరఫరాతో సాధారణంగా పనిచేస్తున్నాయని స్పష్టం చేసింది. తప్పుడు సమాచారం, భయాందోళనలతో కూడిన కథనాలు పూర్తిగా నిరాధారమైనవని, పౌరులు అధికారిక వర్గాలను మాత్రమే విశ్వసించాలని సూచించింది. పుకార్లను వ్యాప్తి చేయకుండా ఉండాలని సూచించామని, ప్రతి పౌరునికి నిరంతరాయ ఇంధన లభ్యతను నిర్ధారించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొంది.

నాలుగో స్థానంలో భారత్

పెట్రోలియం శుద్ధిలో ప్రపంచవ్యాప్తంగా భారత్ 4వ స్థానంలో ఉంది. అలాగే ఎగుమతి చేసే దేశాల్లో 5వ స్థానంలో ఉంది. దీంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ నిల్వలు, లభ్యత పటిష్టంగా ఉన్నాయని, సరఫరాలో రేషన్ చేయమని ఏ రిటైల్ కేంద్రాలకు ఆదేశాలు ఇవ్వలేదని కేంద్రం తెలిపింది. ఇంధన కొతర వల్ల కొన్ని దేశాలు జాతీయ ఇంధన అత్యవసర పరిస్థితి ప్రకటించాయని, దేశంలో అటువంటి చర్యల అవసరం ఏమాత్రం లేదని తెలిపింది. ఇతర దేశాల్లో పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లపై పరిమితులు విధిస్తున్నప్పటికీ.. దేశంలో అలాంటి పరిస్థితి రాదని తెలిపింది. కొన్ని పెట్రోల్ బంక్‌ల వద్ద భయాందోళనతో ప్రజలు కొనుగోలు చేస్తున్నప్పటికీ.. సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా వ్యాప్తి చేసిన తప్పుడు సమాచారం వల్ల అలా జరుగుతున్నాయని స్పష్టం చేసింది. వినియోగదారులకు ఇంధనం నిరంతరం అందించేందుకు పెట్రోల్ బంక్‌లు పనిచేస్తున్నాయంది. కొరత లేకుండా చూసేందుకు బంక్‌లకు గతంలో అనుమతించిన ఒక రోజు క్రెడిట్‌ను మూడు రోజులకు పెంచడానికి కంపెనీలు చర్యలు తీసుకున్నట్లు కేంద్రం పేర్కొంది.

రెండు నెలలకు సరిపడ సరఫరా

“కేవలం 6 రోజులకు సరిపడ ఇంధన నిల్వలు మాత్రమే ఉన్నాయని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. భారత్‌లో మొత్తం 74 రోజులకు సరిపడ రిజర్వ్ సామర్థ్యం ఉంది. వాస్తవ నిల్వ కవరేరజ్ సుమారు 60 రోజులు ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నా.. రెండు నెలలకు సరిపడ సరఫరా అందుబాటులో ఉంది. ఎల్పీజీ కొరత లేదు. దేశంలో రిఫైనరీల్లో ఉత్పత్తి 40 శాతం పెరిగింది. దిగుమతి చేసుకోవాల్సిన గ్యాస్ కంటే ఎక్కువ ఉత్పత్తి జరుగుతుంది. అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా, ఇతర దేశాల నుంచి 800 టీఎంటీలతో కూడిన ఎల్పీజీ కార్గోలు దిగుమతికి సిద్దంగా ఉన్నాయి. అదనను కొనుగోళ్లు నిరంతరం కొనసాగుతున్నాయి. ప్రతీ రోజు 50 లక్షలకుపైగా సిలిండర్లను సరఫరా చేస్తున్నాం. వాణిజ్య సిలిండర్ల కేటాయింపును 50 శాతానికి పెంచాం” అని పెట్రోలియం శాఖ స్పష్టం చేసింది.

Follow Us