
భారత్‌లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలపై పరుగులు పెడుతోంది. శనివారం హౌరా-గువహతి మధ్య తొలి రైలును పచ్చజెండా ఊపి ప్రధాని మోదీ ప్రారంభించారు. వారంలో 6 రోజుల పాటు ఈ రైలు ప్రయాణికులు అందుబాటులో ఉండనుండగా.. నిర్వహణ కోసం ఒక రోజు సర్వీసులు నిలిపివేస్తారు. విమానం తరహాలో అత్యాధునిక లగ్జరీ సౌకర్యాలు ఉన్న ఈ రైలు.. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. సామాన్యులకు అందుబాటులో ఉండేలా తక్కువ ఛార్జీలను ఇందులో అమలు చేస్తుండగా.. టికెట్ల బుకింగ్స్, క్యాన్సిల్‌కు సంబంధించి కఠిన నియమాలు రైల్వేశాఖ అమలు చేస్తోంది. ముఖ్యంగా టికెట్ క్యాన్సిలేషన్‌పై తాజాగా కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది. ఆ నియమాలు ఇవే..
వందే భారత్ స్లీపర్ రైళ్లల్లో టికెట్ క్యాన్సిలేషన్‌కు సంబంధించి కఠిన నిబంధనలను రైల్వేశాఖ ప్రవేశపెట్టింది. రైలు బయలుదేరే సమయానికి 8 గంటల ముందు టికెట్ క్యాన్సిల్ చేస్తే ఎలాంటి రీఫండ్ ఉండదు. ఇక 72 గంటల ముందు రద్దు చేస్తే టికెట్ ధరలో 25 శాతం తగ్గించి రీఫండ్ అందిస్తారు. ఇక 72 నుంచి 8 గంటల మధ్య రద్దు చేస్తే 50 శాతం తగ్గింపు ఉంటుందని రైల్వేశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక రైలు షెడ్యూల్ సమయానికి 8 గంటల ముందు వరకు టికెట్ క్యాన్సిల్ చేయకపోయినా లేదా ఆన్‌లైన్‌లో టీడీఆర్ దాఖలు చేయకపోయినా టికెట్ ఛార్జీ వాపసు ఉండదు.
ఇక రైలులో వీఐపీలకు ఎలాంటి సీటు రిజర్వేషన్లు ఉండవు. కేవలం మహిళలు, విగలాంగులు, సీనియర్ సిటిజన్ల కోటా మత్రమే ఉంటుంది. ఇతర రిజర్వేషన్లు వర్తించవు. వందే భారత్ స్లీపర్ రైళ్లల్లో కనీసం 400 కిలోమీటర్ల దూరానికి ఛార్జ్ వసూలు చేస్తారు. ఇందులో వెయిటింగ్, ఆర్‌ఏసీ టికెట్లు అనుమతించరు. కేవలం టికెట్ కాన్ఫామ్ అయిన వారికి మాత్రమే అనుమతి ఉంటుంది. ఇక ఈ నెలలో ప్రారంభించిన అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌లలో 200 కిలోమీటర్ల దూరానికి కనీసం ఛార్జీ నిర్ణయించగా.. ఎటువంటి ఆర్ఏసీ నిబంధన లేదు.
ప్రస్తుతం ఒకే వందే భారత్ స్లీపర్ రైలు అందుబాటులోకి రాగా.. త్వరలో దేశవ్యాప్తంగా మరిన్ని స్లీపర్ రైళ్లు ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు ఇప్పటికే పలు రూట్లలో ట్రయల్ రన్స్ కూడా పూర్తయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలును సికింద్రాబాద్-ఢిల్లీ మధ్య నడపనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు రైల్వేశాఖ దగ్గర ప్రతిపాదన ఉంది. ప్రస్తుతం ఈ రూట్‌లో తిరుగుతున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ఒకరోజు సమయం పడుతుంది. వందే భారత్ స్లీపర్ రైలు అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం తగ్గనుంది.