FDI నిబంధనల్లో సడలింపు! ఇక చైనా కంపెనీలకు తలుపులు తెరిచినట్టేనా?

ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ FDI నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. 2020లో భూ సరిహద్దు దేశాల పెట్టుబడులకు తప్పనిసరి అనుమతి విధానాన్ని (ప్రెస్ నోట్-3) సడలించింది. దీనివల్ల చైనా వంటి దేశాల కంపెనీలు భారతీయ సంస్థలతో జాయింట్ వెంచర్‌లు ఏర్పాటు చేయడానికి సులభతరం అవుతుంది. IBC, కార్పొరేట్ చట్టాల్లో సవరణలకూ ఆమోదం లభించింది.

FDI నిబంధనల్లో సడలింపు! ఇక చైనా కంపెనీలకు తలుపులు తెరిచినట్టేనా?
Fdi India China Investments

Updated on: Mar 10, 2026 | 7:48 PM

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (FDI) నిబంధనల్లో కీలక మార్పులు చేశారు. ఈ నిర్ణయంతో భారతదేశంతో భూ సరిహద్దు పంచుకునే దేశాల నుంచి వచ్చే పెట్టుబడులకు కొంత ఉపశమనం లభించింది. ముఖ్యంగా చైనాకు చెందిన కంపెనీలు భారతీయ సంస్థలతో కలిసి జాయింట్ వెంచర్‌ల ద్వారా వ్యాపారం చేయడానికి మార్గం సుగమమైంది.

2020లో కోవిడ్ మహమ్మారి సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రెస్ నోట్-3 అనే విధానాన్ని అమలు చేసింది. దీని ప్రకారం భారత్‌తో భూ సరిహద్దు పంచుకునే దేశాల నుండి వచ్చే పెట్టుబడులకు తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతి అవసరం. దీనిని అవకాశవాద టేకోవర్లు లేదా భారతీయ కంపెనీలను విదేశీ సంస్థలు ఆక్రమించకుండా నిరోధించడానికి తీసుకువచ్చారు. అయితే ఇప్పుడు కేంద్రం ఆ నిబంధనల్లో కొంత సడలింపు ఇచ్చింది. దీని వల్ల చైనా సహా సరిహద్దు దేశాలకు చెందిన కంపెనీలు భారతీయ సంస్థలతో కలిసి పెట్టుబడులు పెట్టడానికి సులభతరం అవుతుంది. ఇప్పటికే కొన్ని భారతీయ కంపెనీలు చైనా సంస్థలతో జాయింట్ వెంచర్‌ల కోసం ఎదురుచూస్తున్నాయి.

IBC, కార్పొరేట్ చట్టాల్లో మార్పులు

ఈ సమావేశంలో ప్రభుత్వం ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్‌రప్టసీ కోడ్‌కు సంబంధించిన సవరణలకూ ఆమోదం తెలిపింది. 2025లో తీసుకురాబోయే సవరణల ద్వారా దివాలా ప్రక్రియను మరింత సులభతరం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే కార్పొరేట్ చట్టాల సవరణ బిల్లుకూ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం చైనా భారత్‌కు రెండవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. 2024-25లో భారత్ నుంచి చైనాకు ఎగుమతులు 14.25 బిలియన్ డాలర్లు కాగా, 2023-24లో ఇది 16.66 బిలియన్ డాలర్లుగా ఉంది. మరోవైపు చైనా నుంచి దిగుమతులు 113.45 బిలియన్ డాలర్లకు పెరిగాయి. దీంతో రెండు దేశాల మధ్య వాణిజ్య లోటు కూడా పెరిగింది. 2023-24లో ఇది సుమారు 85 బిలియన్ డాలర్లు ఉండగా, 2024-25లో 99.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-జనవరి కాలంలో భారత్ చైనాకు ఎగుమతులు 15.88 బిలియన్ డాలర్లు, దిగుమతులు 108.18 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us