నష్టభయం లేకుండా పెట్టుబడి(Investment) పెట్టాలనుకునేవారికి పోస్టాఫీస్ పథకాలు మంచి ఎంపిక అవుతాయి. పోస్టాఫీస్ పొదుపు పథకాల్లో(Post Office Scheme) నష్టభయం దాదాపు ఉండదనే చెప్పాలి. నెల నెలా కచ్చితమైన ఆదాయం కోరుకునే వారు పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ పథకంలో పొదువు చేసుకోవచ్చు. సీనియర్ సిటిజన్లు, విశ్రాంత ఉద్యోగులకు ఈ పథకం సరిగ్గా సరిపోతుంది. ఈ పథకంలో కనీసం రూ.1000 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ పథకం ప్రారంభించిన సమయంలో ఉన్న వడ్డీరే(Intrest)టు.. పెట్టుబడి వ్యవధి మొత్తం వర్తిస్తుంది. అందువల్ల కచ్చితమైన రాబడి ఉంటుంది.
ఈ ఖాతాను వ్యక్తిగతంగా గానీ, ఇద్దరు లేదా ముగ్గురు జాయింట్‌గా గానీ తెరవొచ్చు. 10 ఏళ్ల పైబడి వయసున్న పిల్లల పేరుపై కూడా ఖాతాను తెరిచే వీలుంది. పిల్లల పేరుపై ఖాతా తెరిస్తే, వారికి 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఖాతా వారికి బదిలీ చేసి, మెచ్యూరిటీ మొత్తాన్ని అందజేస్తారు.
ఈ పథకంలో డిపాజిట్లు రూ.1000 నుంచి ప్రారంభించొచ్చు. వ్యక్తిగత ఖాతాదారులు గరిష్ఠంగా రూ.4.50 లక్షలు, ఉమ్మడి ఖాతాదారులు గరిష్ఠంగా రూ.9 లక్షల వరకు ఇందులో పెట్టుబడి పెట్టొచ్చు. ఉమ్మడి ఖాతాలో ఖాతాదారులందరికీ సమానంగా వాటా ఉంటుంది. ఇందులో 5 సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. ఒకవేళ ఖాతాదారుడు మెచ్యూరిటీకి ముందే మరణిస్తే ఖాతా మూసివేయవచ్చు. నామినీ లేదా చట్టబద్ధమైన వారసులకు ఖాతాలో ఉన్న మొత్తాన్ని చెల్లిస్తారు. డబ్బు వాపసు చేసే ముందు నెల వరకు వడ్డీ చెల్లిస్తారు.
డిపాజిట్ చేసిన ఏడాది తర్వాత ఖాతాను మూసివేసి నగదును విత్‌డ్రా చేసుకోవచ్చు. ఏడాది తర్వాత, మూడేళ్లకు ముందు ఖాతా మూసివేయాలనుకుంటే డిపాజిట్ మొత్తం సొమ్ముపై 2 శాతం కోత విధిస్తారు. మూడేళ్లు నిండి, ఐదేళ్లు పూర్తి కాకపోతే డిపాజిట్‌పై 1 శాతం కోత విధిస్తారు. ఈ పథకంలో లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది కాబట్టి పెట్టుబడి సమయంలో ఉన్న వార్షిక వడ్డీ రేటు మెచ్యూరిటీ వరకు వర్తిస్తుంది. అందువల్ల నెల నెలా వచ్చే వడ్డీ స్థిరంగా ఉంటుంది. ఉదాహరణకు, పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ వడ్డీ రేటు ప్రస్తుతం సంవత్సరానికి 6.60 శాతంగా ఉంది. ఇప్పుడు ఖాతా తెరిస్తే మెచ్యూరిటీ పీరియడ్ వరకు ఇదే వార్షిక వడ్డీ రేటు వర్తిస్తుంది. ఖాతా తెరిచిన తేదీ నుంచి ఒక నెల పూర్తయిన తర్వాత వడ్డీ చెల్లింపులు ప్రారంభించి మెచ్యూరిటీ వరకు కొనసాగిస్తారు. పెట్టుబడిదారుడు నెల నెలా వడ్డీని క్లెయిమ్ చేయాలి.
Read Also.. PPF vs NPS investment: ఉద్యోగ విరమణ నిధికోసం ఎందులో పెట్టుబడి పెడితే లాభం.. పీపీఎఫ్? ఎన్ పీఎస్?