Milk Price Increase:ఒక వైపు పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతుంటే.. నిత్యావసర సరుకుల ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. ఇక ప్రతి రోజు అవసరమయ్యే పాల ధరలు కూడా ఇటీవల పెరిగిన విషయం తెలిసిందే. ముందే కరోనాతో ఇబ్బందులు పడి కోలుకుంటున్న తరుణంలో ధరల మోత మోగిపోతున్నాయి. ఇక ఉక్రెయిన్- రష్యా వార్ కారణంగా పలు వస్తువుల ధరలు పెరిగిపోయాయి. కారణాలు ఏవైనా.. సామాన్యుడిపై తీవ్ర భారం పడుతుందనే చెప్పాలి. ఇప్పుడు మరోసారి అమూల్ పాల (Amul Milk) ధరలు కూడా పెరగబోతున్నాయని తెలుస్తోంది. ఎనర్జీ, లాజిస్టిక్స్, ప్యాకేజింగ్ ధరలు పెరగడంతో మళ్లీ ధరల పెంపు ఉంటుందని అమూల్ మిల్క్ కంపెనీ వర్గాల ద్వారా సమాచారం. అయితే ఏ మేరకు ధరలు పెరిగే అవకాశాలున్నాయనే విషయంపై క్లారిటీ లేదు. మీడియాతో మాట్లాడిన అమూల్ ఎండీ ఆర్‌ఎస్ సోధి.. ధరలు పెరుగుతాయి తప్ప తగ్గే అవకాశాలేమి లేవని చెప్పుకొచ్చారు. గత రెండు సంవత్సరాలలో అమూల్ పాల ధరలు 8 శాతం వరకు పెరిగినట్లు వెల్లడించారు. దీంతో గత నెలలో లీటర్‌పై రూ.2 పెరిగింది. అయితే ఇతర రంగాలతో పోలిస్తే అమూల్,డెయిరీ రంగాల గ్రోత్ చాలా తక్కువేనని పేర్కొన్నారు. రైతులు ధరలు అధికంగా ఉండటం వల్ల లబ్ది పొందుతున్నారన్నారు.
అలాగే విద్యుత్ ఖర్చులు కూడా పెరిగాయని, ఇవి కోల్డ్ స్టోరేజ్ ఖర్చులపై ప్రభావం చూపుతున్నాయన్నారు. లాజిస్టిక్స్ ఖర్చులు కూడా ఈ విధంగానే పెరిగాయి. ఈ ఖర్చుల వల్ల లీటర్ పాలపై రూ.1.20 పెరిగాయి. కరోనా సమయంలో రైతుల ఆదాయం ఒక్కో లీటర్‌పై రూ.4 వరకు పెరిగినట్లు అమూల్ ఎండి తెలిపారు. అయితే ఇతర కారణాల వల్ల లాభాలు తగ్గుముఖం పట్టాయని, అమూల్ సంపాదించే ప్రతి రూపాయిలో 85 పైసలు రైతులకే వెళ్తుందని వివరించారు.
ఇవి కూడా చదవండి: