Microsoft: త్వరలో భాగ్యనగరానికి అతిపెద్ద ఐటీ దిగ్గజం.. రూ.15 వేల కోట్లతో మైక్రోసాఫ్ట్ డాటా సెంటర్‌..!

|

Jul 22, 2021 | 10:02 AM

విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న భాగ్యనగరం మెడలో మరో మణిహారం చేరబోతుంది. గ్లోబల్‌ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌.. హైదరాబాద్‌లో మరో భారీ పెట్టుబడికి సిద్ధమైనట్టు సమాచారం.

Microsoft: త్వరలో భాగ్యనగరానికి అతిపెద్ద ఐటీ దిగ్గజం.. రూ.15 వేల కోట్లతో మైక్రోసాఫ్ట్ డాటా సెంటర్‌..!
Microsoft
Follow us on

Microsoft set up data centre in Hyderabad: విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న భాగ్యనగరం మెడలో మరో మణిహారం చేరబోతుంది. గ్లోబల్‌ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌.. హైదరాబాద్‌లో మరో భారీ పెట్టుబడికి సిద్ధమైనట్టు సమాచారం. నగరం సమీపంలో రూ.15 వేల కోట్లతో డాటా సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో కంపెనీ ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నారు. ఇందుకు కోసం తెలంగాణ ప్రభుత్వం సూచించిన స్థలంపై మైక్రోసాఫ్ట్‌ స్థాపించేందుకు సంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. చర్చలు తుది దశకు చేరాయని, భూమి కేటాయింపుపై స్పష్టత వచ్చాక ప్రాజెక్టును ప్రకటించే అవకాశం ఉంది.

‘ఐటీ రంగంలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం.. పెద్ద ఎత్తున అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఈ క్రమంలోనే మైక్రోసాఫ్ట్‌ సంస్థ హైదరాబాద్‌లో డాటా సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తోంది. త్వరలోనే దీనిపై ప్రకటన రావచ్చు’ అని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. మైక్రోసాఫ్ట్‌ ఇప్పటికే జియోతో కలిసి దేశంలో క్లౌడ్‌ డాటా సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. తమ క్లౌడ్‌ కంప్యూటింగ్‌ సర్వీస్‌ ‘అజూర్‌ క్లౌడ్‌’ను జియో నెట్‌వర్క్‌పై అందిస్తున్నది. క్లౌడ్‌ టెక్నాలజీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వైపు కదలాలని చూస్తున్న చిన్న వ్యాపారాలే దీని లక్ష్యం. అయితే, వీటికి అదనంగానే ఇప్పుడు డాటా సెంటర్లను మైక్రోసాఫ్ట్‌ విస్తరిస్తోంది. ఈ క్రమంలోనే టెక్నాలజీపరంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో డాటా సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం సైతం టెక్నాలజీ రంగానికి పెద్దపీట వేస్తుండటం సాఫ్ట్‌వేర్ రంగానికి కలిసొచ్చింది. అంతేకాదు, తెలంగాణ నిరుద్యోగులకు పెద్ద ఎత్తు ఉద్యోగావకాశాలు మెరుగుపడనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

మైక్రోసాఫ్ట్‌ డాటా సెంటర్‌ ఏర్పాటు ఖరారైతే.. ఇది ఈ విభాగంలో హైదరాబాద్‌కు వచ్చిన రెండో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డీఐ) కానున్నది. ఇప్పటికే ‘అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌’ హైదరాబాద్‌లో రూ.20 వేల కోట్లతో డాటా సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నది. డాటా సెంటర్స్‌ విభాగంలో భారత్‌కు వచ్చిన అతిపెద్ద ఎఫ్‌డీఐ ఇదే కావడం గమనార్హం. ఇప్పుడు మైక్రోసాఫ్ట్‌ సైతం హైదరాబాద్‌లోనే రూ.15 వేల కోట్లతో డాటా సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నది. ఇక గ్లోబల్‌ సెర్చింజన్‌ గూగుల్‌ కూడా భారత్‌లో డాటా సెంటర్‌ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నది. ఇప్పటికే ఈ సంస్థకు అమెరికా తర్వాత రెండో అతిపెద్ద క్యాంపస్‌ హైదరాబాద్‌లో ఉన్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో డాటా సెంటర్‌నూ హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేయవచ్చని మార్కెట్‌ వర్గాల అంచనా. ఇవన్నీ కార్యరూపం దాల్చితే త్వరలోనే హైదరాబాద్‌ ‘డాటా సెంటర్‌ హబ్‌’గా మారడం ఖాయమని నిపుణులు అంటున్నారు. 5జీ టెక్నాలజీ, డాటా లోకలైజేషన్‌.. ఈ మార్కెట్‌ విస్తరణకు దోహదం చేస్తున్నాయి.

దేశంలో ‘బీఏఎం డిజిటల్‌ రియల్టీ’ బ్రాండ్‌ పేరుతో బ్రూక్‌ఫీల్డ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సైతం ఓ జాయింట్‌ వెంచర్‌ కింద డాటా సెంటర్లను అభివృద్ధి చేయాలని యోచిస్తోంది. కెనడాకు చెందిన బ్రూక్‌ఫీల్డ్‌, అమెరికాకు చెందిన డిజిటల్‌ రియల్టీ సంస్థలకు అనుబంధంగా ఈ కంపెనీ ఉంటుంది. అన్నీ కలిసొస్తే ఈ వెంచర్‌కూ హైదరాబాదే వేదిక కావచ్చన్న అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు మైక్రోసాఫ్ట్‌ వేగం పెంచినట్లు ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలిసింది.

Read Also…  Viral: మహిళ బయటికి వెళ్లగానే.. ప్లాట్‌లోకి చొరబడుతున్న యజమాని.. చివరికి ఏం జరిగిందంటే!