
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. ద్విచక్ర వాహనాలతో పాటు కార్ల అమ్మకాలు కూడా దూసుకుపోతున్నాయి. ప్రముఖ కంపెనీల నుంచి ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి కూడా గణనీయంగా పెరిగింది. ఒక్కసారి చార్జింగ్ చేస్తే ఏ మాత్రం ఇబ్బంది లేకుండా దూసుకుపోవచ్చు. పెరుగుతున్న పెట్రోలు ధర నుంచి రక్షించుకోవచ్చు. అలాగే పర్యావరణ పరిరక్షణకు ఆస్కారం ఉండడంతో ఈవీలపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.
ఎంజీ మోటారు ఇండియా కంపెనీ తన ప్రతిష్టాత్మకమైన ఎంజీ జెడ్ఎస్ ఈవీ కారు రేంజ్ ను పరీక్షించింది. ఇందుకోసం బెంగళూరు – పుదుచ్చేరి రోడ్డులో రౌండ్ ట్రిప్ నిర్వహించింది. మూడు రోజుల్లో 650 కిలోెమీటర్లు ప్రయాణించి.. కారు సామర్థ్యం, రేంజ్, వేగం తదితర వాటిపై ఉన్న అపోహలను తొలగించింది. మహిళా ఆటో వ్లాగర్ల బృందాన్ని కారులో తీసుకువెళ్లింది. ఒకే చార్జింగ్ తో పుదుచ్చేరికి సుమారు 325 కిలోమీటర్లు ప్రయాణం సాగింది.
ఎంజీ జెడ్ఎస్ ఈవీ కారులో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ముఖ్యంగా దీని రేంజ్ సూపర్ అని చెప్పవచ్చు. మిగిలిన ఫీచర్లు, ఇతర వివరాలను తెలుసుకుందాం.
జెడ్ఎస్ ఈవీ కారు డిజైన్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. డైనమిక్ లైన్లు, గ్రిల్ డిజైన్, అల్లాయ్ డిజైన్, ఎల్ఈడీ హాక్-ఐ హెడ్‌ల్యాంప్‌లు ఆకర్షణీయంగా ఉన్నాయి. ముదురు బూడిద రంగు థీమ్, 25.7 సీఎం హెచ్ డీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, 17.78 సీఎం ఎల్సీడీ స్క్రీన్‌తో పూర్తి డిజిటల్ క్లస్టర్ బాగుంది. డ్యూయల్-పేన్ పనోరమిక్ స్కై రూఫ్, ఎయిర్ ఫిల్టర్, లెదర్ తో చుట్టిన స్టీరింగ్ వీల్ ఆకట్టుకుంటున్నాయి. 75+ కనెక్ట్ చేయబడిన కార్ ఫీచర్లు ఉన్నాయి.
ఎంజీ జెడ్ఎస్ ఈవీ కారు 176పీఎస్ పవర్, 280 ఎన్ ఎమ్ టార్క్‌ను అందిస్తుంది. కేవలం 8.5 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.
మన అవసరాలకు అనుగుణంగా ఈ కారులో వివిధ డ్రైవింగ్ మోడ్‌లు ఉన్నాయి.
సాధారణ మోడ్: నగర ప్రయాణం, హైవే క్రూజింగ్ సమయంలో సాఫీగా ప్రయాణించడానికి వీలుగా ఉంటుంది.
ఎకో మోడ్: బ్యాటరీ శక్తిని ఆదా చేయడానికి ఉపయోగపడుతుంది. థొరెటల్ రెస్పాన్స్, ఇతర వాహన సెట్టింగ్‌లను సర్దుబాటు చేయడం ద్వారా శక్తిని పెంచుతుంది, సుదీర్ఘ ప్రయాణాల సమయంలో ఈ మోడ్ ఉపయోగంగా ఉంటుంది.
స్పోర్ట్ మోడ్: పెరిగిన పవర్ అవుట్‌పుట్‌తో ఉత్సాహభరితమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది.
ఈ కారులో అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (అడాస్) లెవల్ 2 ఉంది. అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, బెండ్ క్రూయిజ్ అసిస్టెన్స్, ట్రాఫిక్ జామ్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, లేన్ కీప్ అసిస్ట్, ఫ్రంట్ కొలిషన్ వార్నింగ్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, హేడ్‌లాక్ బ్రేకింగ్ వంటి 17 ఫీచర్లు ఉన్నాయి. స్పీడ్ వార్నింగ్ మోడ్ తో ప్రయాణంలో భద్రత లభిస్తుంది.
జెడ్ఎస్ ఈవీకి 50.3 కేడబ్ల్యూహెచ్ ప్రిస్మాటిక్ సెల్ బ్యాటరీ ద్వారా శక్తి లభిస్తుంది. దీని క్లెయిమ్ పరిధి 461 కిలోమీటర్లు. వినియోగదారులు డీసీ సూపర్ ఫాస్ట్ ఛార్జర్లతో ఎంజీ డీలర్‌షిప్‌ల వద్ద వాహనాలను ఛార్జ్ చేయవచ్చు. కేవలం 60 నిమిషాల్లో దాదాపు 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. అలాగే ఏసీ ఫాస్ట్ ఛార్జర్లు 8 నుంచి 9 గంటల్లో వందశాతం ఛార్జింగ్ చేస్తాయి. అలాగే పోర్టబుల్ ఛార్జింగ్ కేబుల్ ఏదైనా 15ఏ సాకెట్‌లోకి ప్లగ్ చేసినప్పుడు 18 నుంచి 19 గంటల్లో కారును వందశాతం చార్జింగ్ అవుతుంది.
ఎంజీ జెడ్ఎస్ ఈవీ నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. దీని ధర రూ. 18.98 లక్షల నుంచి రూ. 25.20 లక్షల వరకూ ఉంటుంది. ఎంపీ తన వంద సంవత్సరం వేడుకలలో భాగంగా 100-ఇయర్ లిమిటెడ్ ఎడిషన్ను బ్రిటిష్ రేసింగ్ గ్రీన్ స్ఫూర్తితో ప్రత్యేక ఎవర్‌గ్రీన్ రంగుతో విడుదల చేసింది. ఈ ఎక్స్‌క్లూజివ్ ప్లస్ వేరియంట్ రూ. 24.18 లక్షలకు అందుబాటులో ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..