Meta: విచిత్ర కారణంతో ఉద్యోగులను తొలగించిన ‘మెటా’.. ఫుడ్‌ వోచర్లను..

|

Oct 25, 2024 | 10:26 AM

కంపెనీలు ఉద్యోగులను తొలగించడం సర్వ సాధారణం. ఇందుకోసం రకరకాల కారణాలు చెబుతుంటాయి. అయితే తాజాగా మెటా ఓ విచిత్ర కారణంతో ఉద్యోగులను తొలగించింది. కంపెనీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారన్న కారణంతో 24 మందిని తొలగించింది. ఇంతకీ ఉద్యోగులను తొలగించడానికి కంపెనీ చెప్పిన ఆ కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Meta: విచిత్ర కారణంతో ఉద్యోగులను తొలగించిన మెటా.. ఫుడ్‌ వోచర్లను..
Meta
Follow us on

కంపెనీలు ఉద్యోగులను తొలగించడం సర్వసాధారణం. అయితే ఇందుకు ఎన్నో కారణాలు చెబుతుంటారు. ముఖ్యంగా పనితీరు బాగాలేక పోయినా, ఆశించిన స్థాయిలో ప్రొడక్టివిటీ లేకపోయినా ఉద్యోగులను తొలగిస్తుంటారు. అయితే మార్క్‌ జుకర్‌బర్గ్‌ యాజమాన్యంలోని టెక్‌ దిగ్గజం మెటా విచిత్ర కారణంతో ఉద్యోగులను తొలగించింది. లాస్‌ఏంజిల్స్‌లోని తన కార్యాలయంలో పనిచేస్తున్న 24 మందిని కంపెనీ తొలగించింది. ఇంతకీ ఉద్యోగులను ఎందుకు తొలగించారనేగా సందేహం..

మెటా కంపెనీ తన ఉద్యోగులకు ఉచిత ప్రోత్సహకాలు అందిస్తుంటుంది. ఇందులో భాగంగా ఉచిత భోజనం కోసం వోచర్లను అందిస్తుంది. అయితే ఫుడ్‌ కోసం ఉపయోగించాల్సిన ఈ వోచర్లను కొందరు ఉద్యోగులు దుర్వినియోగం చేసినట్లు సంస్థ గుర్తించింది. ఈ కారణంతో ఏకంగా 24 మందిని తొలగించింది. కంపెనీలు పనిచేస్తున్న వారికి భోజనం కోసం ప్రతీ రోజూ ఈ వోచర్లను అందిస్తారు.

గ్రూబ్‌హబ్‌, ఊబర్‌ఈట్స్ వంటి డెలివరీ సేవల ద్వారా ఆహారాన్ని ఆర్డర్‌ చేయడానికి రోజువారీ భోజన వసతి అందిస్తుంది. ఇందులో భాగంగా ఒక్కో ఉద్యోగికి టిఫిన్‌ కోసం 20 డాలర్లు, భోజనానికి 25 డాలర్లు, డిన్నర్‌ కోసం 25 డాలర్ల విలువ చేసే వోచర్లను ఇస్తుంటారు. అయితే కొందరు ఉద్యోగులు ఈ వోచర్లను ఫుడ్‌కు బదులుగా.. టూత్‌పేస్ట్, లాండ్రీ డిటర్జెంట్, వైన్ గ్లాసెస్ వంటి వ్యక్తిగత వస్తువులను కొనుగోలు చేయడానికి ఉపయోగించారు. దీంతో వీరిరి తొలగిస్తూ మెటా నిర్ణయం తీసుకుంది. ఉద్యోగం కోల్పోయిన కొందరిలో తాము వీక్‌ఆఫ్‌ ఉన్న రోజుల్లోనూ ఇలా ఉచిత భోజనం కోసం ఇచ్చిన వోచర్లను ఉపయోగించినట్లు సంస్థ యాజమాన్యం గుర్తించింది.

ఆఫీస్‌కు రాని సమయంలో కూడా భోజన సదుపాయాన్ని వినియోగించినట్లు కంపెనీ దర్యాప్తులో తేలింది. ఈ వ్యవహారంపై ఉద్యోగులకు ప్రాథమిక హెచ్చరికలు ఉన్నప్పటికీ వీటిని కొందరు అతిక్రమించారు. దాంతో సంస్థ యాజమాన్యం వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..