Budget 2024: ‘అగ్రి’కి అగ్రతాంబూలం? మధ్యంతర బడ్జెట్‌పై విశ్లేషకుల అంచనాలు ఇవి..

మధ్యంతర బడ్జెట్లో ఆర్థిక ఏకీకరణపై దృష్టి సారించి సంక్షేమ వ్యయాన్ని పెంచే అవకాశం ఉంది. కానీ పెద్ద విధాన మార్పులేవీ ఉండకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకురావడానికి ప్రభుత్వం కీలకమైన వ్యవసాయ రంగ పథకాలకు కేటాయింపులను గణనీయంగా పెంచుతుందని..  రుణాల మొత్తాన్ని కూడా అధికం చేస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Budget 2024: ‘అగ్రి’కి అగ్రతాంబూలం? మధ్యంతర బడ్జెట్‌పై విశ్లేషకుల అంచనాలు ఇవి..
Budget 2024

Updated on: Jan 28, 2024 | 7:35 AM

మధ్యంతర బడ్జెట్ 2024-25కి సమయం ఆసన్నమైంది. ఫిబ్రవరి ఒకటో తేదీన ఆర్థిక శాఖ మంత్రి నిర్మాల సీతారామన్ బడ్జెట్ ను ఆవిష్కరించనున్నారు. 2024 ఎన్నికల సంవత్సరం, ఏప్రిల్-మేలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి సమగ్ర వార్షిక బడ్జెట్ కాకుండా ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్ లేదా ఓట్ ఆన్ అకౌంట్‌ను సమర్పిస్తారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఈ ఏడాది జూలైలో కొత్త పూర్తి బడ్జెట్‌ను విడుదల చేస్తారు. ఈ క్రమంలో ఈ మధ్యంతర బడ్జెట్లో ఆర్థిక ఏకీకరణపై దృష్టి సారించి సంక్షేమ వ్యయాన్ని పెంచే అవకాశం ఉంది. కానీ పెద్ద విధాన మార్పులేవీ ఉండకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకురావడానికి ప్రభుత్వం కీలకమైన వ్యవసాయ రంగ పథకాలకు కేటాయింపులను గణనీయంగా పెంచుతుందని..  రుణాల మొత్తాన్ని కూడా అధికం చేస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. వ్యవసాయ రంగంలో వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1.8 శాతానికి తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ఇది ఏడాది క్రితం 4 శాతంగా ఉంది. ఈ క్రమంలో వ్యవసాయ సంబంధిత స్కీమ్లకు కేటాయింపులు ఉంటాయని చెబుతున్నారు. ముఖ్యంగా, 2023-24 కేంద్ర బడ్జెట్‌లో, ఆర్థిక మంత్రి వ్యవసాయం, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖకు రూ.1.25 లక్షల కోట్లు కేటాయించారు, ఇది 2013-14లో చేసిన రూ.27,662.67 కోట్ల కంటే చాలా ఎక్కువ. ఈ క్రమంలో పరిశ్రమ నిపుణులు ఈ బడ్జెట్ కేటాయింపులపై ఏం చెబుతున్నారో చూద్దాం..

పీఎం కిసాన్ నిధి పెరగొచ్చు..

2019లో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రారంభించింది. ఇది చిన్న రైతులకు సంవత్సరానికి రూ. 6,000 వరకు ఆర్థిక సహాయం అందించింది. రాబోయే బడ్జెట్‌లో ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ స్కీమ్ కింద సహాయం పరిమాణం పెరగవచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

రుణాలు కూడా ..

రాబోయే ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ రుణ లక్ష్యాన్ని రూ. 22-25 లక్షల కోట్లకు పెంచే అవకాశం ఉందని, అర్హులైన ప్రతి రైతుకు అధికారికంగా రుణాలు అందేలా చూడవచ్చని చెబుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ వ్యవసాయ రుణ లక్ష్యం రూ. 20 లక్షల కోట్లు, డిసెంబర్ 2023 నాటికి ఆర్థిక లక్ష్యంలో 82 శాతం సాధించింది. సీఐఐ (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ) డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ మాట్లాడుతూ మధ్యంతర బడ్జెట్‌లో సమ్మిళిత వృద్ధిని నడపడానికి వ్యవసాయం, గ్రామీణ విభాగాలు కీలకమైన ప్రాధాన్యతగా ఉండాలి. వ్యవసాయంలో, వృథాను తగ్గించడానికి గిడ్డంగులను ప్రోత్సహించాలి. ఎలక్ట్రానిక్ నెగోషియబుల్ వేర్‌హౌస్ రసీదుల (ఈఎన్‌డబ్ల్యుఆర్‌లు) కవరేజీని తప్పనిసరిగా పెంచాలి. ఫైనాన్స్, ట్రేడింగ్, ట్రేడింగ్ సెటిల్‌మెంట్‌ని యాక్సెస్ చేయడానికి వాటిని ఉపయోగించమని సిఫార్సు చేస్తామంటున్నారు

ఇవి కూడా చదవండి

ఎరువులపై సబ్సిడీలు..

దేశంలో ఎరువుల సబ్సిడీలను నేరుగా రైతులకు నగదు బదిలీకి అనుగుణంగా మార్చుకోవాల్సిన అవసరం ఉందని పరిశ్రమల సంఘం పేర్కొంది. ది ఆర్గానిక్ వరల్డ్ వ్యవస్థాపకుడు, ఎండీ గౌరవ్ మంచాంద మాట్లాడుతూ భారతదేశానికి కార్యకలాపాలను ఆప్టిమైజ్ చేయడానికి, అభివృద్ధి చెందుతున్న మార్కెట్ అవకాశాలను ఉపయోగించుకోవడానికి బడ్జెట్ మద్దతు, బలమైన రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (ఎఫ్పీఓలు) అవసరం. అధిక వ్యవసాయ బీమా ఖర్చులు, గ్రామీణ ఉపాధి పథకాలలో ఎక్కువ పెట్టుబడి, మెరుగైన నీటిపారుదల సౌకర్యాలు, మెరుగైన గ్రామీణ మౌలిక సదుపాయాలు భారీ వ్యత్యాసాన్ని కలిగిస్తాయి.

రాబోయే బడ్జెట్‌పై ఉన్న అంచనాల గురించి ధనుక అగ్రిటెక్‌ ఎండీ ఎంకే ధనుక మాట్లాడుతూ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను కొనసాగిస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేకంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధిలో కొంత పెరుగుదలను, గ్రామీణ వ్యయాలను మెరుగుపరచాలని తాము ఆశిస్తున్నట్లు చెప్పారు. గత బడ్జెట్‌లో పీఎం-కిసాన్ పథకానికి రూ.60,000 కోట్లు కేటాయించగా.. నవంబర్ 2023 నాటికి, ఈ పథకం కింద, 11 కోట్ల మంది రైతులకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డిబిటి) ద్వారా రూ. 2.81 లక్షల కోట్లు విడుదలయ్యాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..