
అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి జూలై 2026లో రికార్డు స్థాయి అమ్మకాలను నమోదు చేసింది. ఒకే నెలలో దేశీయ మార్కెట్లో 2 లక్షలకు పైగా వాహనాలను విక్రయించి, భారతీయ ఆటోమొబైల్ రంగంలో కొత్త రికార్డును సృష్టించింది. మొత్తం 2,41,241 వాహనాలను పంపిణీ చేసిన సంస్థలో 30,056 యూనిట్లు ఎగుమతులకు వెళ్లగా, దేశీయంగా 2,00,123 వాహనాలు అమ్ముడయ్యాయి.
దేశీయ అమ్మకాలలో ప్యాసింజర్ వాహనాల (PV) వాటా 1,93,203 యూనిట్లు కాగా, కమర్షియల్ వాహనాల (CV) అమ్మకాలు 3,920 యూనిట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది జూలైలో మొత్తం 1,80,526 వాహనాలు విక్రయించిన మారుతి సుజుకి, ఈసారి ఆ సంఖ్యను గణనీయంగా పెంచుకుంది. అలాగే జూలై 2025లో దేశీయ అమ్మకాలు 1,40,570 యూనిట్లుగా ఉండగా, ఈ ఏడాది 2 లక్షల మార్క్‌ను దాటడం విశేషం.
మారుతి సుజుకి మార్కెటింగ్ అండ్ సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బానర్జీ మాట్లాడుతూ, ప్రస్తుతం సంస్థ వద్ద సుమారు 1.60 లక్షల పెండింగ్ బుకింగ్‌లు ఉన్నాయని తెలిపారు. ఇటీవల మార్కెట్లోకి వచ్చిన కొత్త బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్‌కు ప్రతిరోజూ దాదాపు 2,000 బుకింగ్‌లు వస్తుండగా, ఎలక్ట్రిక్ SUV అయిన ఇ-విటారాకు ప్రతి నెలా సుమారు 4,000 బుకింగ్‌లు నమోదవుతున్నాయని వెల్లడించారు. పెరుగుతున్న డిమాండ్, కొత్త మోడళ్లకు లభిస్తున్న ఆదరణతో రానున్న నెలల్లో కూడా అమ్మకాలు మరింత బలంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి