Maruti Suzuki: కస్టమర్లకు బ్యాడ్‌న్యూస్.. కార్ల రేట్లను భారీగా పెంచనున్న మారుతి.. అప్పట్లోపు కొంటే..

దేశీయ కార్ల మార్కెట్ దిగ్గజం మారుతి సుజుకి ఇండియా వాహనదారులకు గట్టి షాక్ ఇచ్చింది. వచ్చే నెల నుంచి తమ అన్ని మోడళ్ల వాహనాల ధరలను పెంచుతున్నట్లు గురువారం అధికారికంగా ప్రకటించింది. మోడళ్లను బట్టి ఈ ధరల పెంపు గరిష్టంగా రూ. 30,000 వరకు ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది.

Maruti Suzuki: కస్టమర్లకు బ్యాడ్‌న్యూస్.. కార్ల రేట్లను భారీగా పెంచనున్న మారుతి.. అప్పట్లోపు కొంటే..
Maruti Suzuki Price Hike

Updated on: May 22, 2026 | 11:47 AM

ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజూకీ ఇండియా వాహనదారులకు ఊహించని షాక్ ఇచ్చింది. జూన్ ఫస్ట్‌ నుంచి తమ అన్ని మోడళ్ల కార్ల ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, ప్రతికూల వ్యయ వాతావరణాన్ని కారణంగా జూన్ 2026 నుండి తమ అన్ని మోడళ్ల వాహనాల ధరలను రూ. 30,000 వరకు పెంచనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో మారుతి సుజుకి వివరాలను వెల్లడించింది. పెరిగే ధరలు మోడల్, వేరియంట్‌ను బట్టి మారుతుంటాయని స్పష్టం చేసింది.

ధరల పెంపునకు కారణాలు ఇవేనా

నిత్యావసరాలు, వస్తువుల ధరలు విపరీతంగా పెరగడం, ప్రతికూల వ్యయ వాతావరణం కారణంగా ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని కంపెనీ తెలిపింది.గత కొన్ని నెలలుగా వ్యయ భారాన్ని తగ్గించుకుంటూ, వినియోగదారులపై భారం పడకుండా కంపెనీ శతవిధాలా ప్రయత్నించిందని.. కానీ, ప్రస్తుతం ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు గరిష్ట స్థాయికి చేరడం, ఉత్పత్తి వ్యయం నిరంతరం పెరుగుతుండటంతో.. ఆ భారంలో కొంత భాగాన్ని మార్కెట్‌కు బదిలీ చేయక తప్పడం లేదని చెప్పుకొచ్చింది. అయితే, కస్టమర్లపై భారం వీలైనంత తక్కువగా ఉండేలా చూస్తున్నామని పేర్కొంది.

గత ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి కంపెనీ వద్ద సుమారు 1.9 లక్షల కస్టమర్ ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో 18 శాతం జీఎస్టీ పరిధిలోకి వచ్చే చిన్న కార్ల సెగ్మెంట్‌కు చెందిన ఆర్డర్లే దాదాపు 1.3 లక్షల వరకు ఉండటం గమనార్హం. ఉత్పత్తి సమస్యల కారణంగా సకాలంలో కార్లను డెలివరీ చేయలేకపోయినందుకు, ఈ ఏడాది జనవరిలో బుక్ చేసుకున్న కస్టమర్ల కోసం కంపెనీ ‘ప్రైస్ ప్రొటెక్షన్ స్కీమ్’ను కూడా తీసుకొచ్చింది.

గతేడాది సెప్టెంబర్‌లో జీఎస్టీ 2.0 అమలులోకి వచ్చిన తర్వాత కంపెనీ తన పాపులర్ మోడళ్ల ధరలను భారీగా తగ్గించింది. అప్పట్లో ఎస్-ప్రెస్సోపై రూ. 1,29,600, ఆల్టో K10పై రూ. 1,07,600, సెలెరియోపై రూ. 94,100, వ్యాగన్-ఆర్ ధరలపై రూ. 79,600 వరకు తగ్గించింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us