AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ట్యాక్స్‌పేయర్లకు గుడ్‌న్యూస్.. జీఎస్టీ రూల్స్‌లో సంచలన మార్పులు.. ఇక అరెస్టులకు చెక్!

జీఎస్టీ కౌన్సిల్ కీలక సంస్కరణలు ప్రకటించింది. జీఎస్టీ అధికారులకు ఉన్న అరెస్ట్ అధికారాలను తొలగించి, ప్రాసిక్యూషన్ పరిమితిని రూ.1 కోటి నుంచి రూ.5 కోట్లకు పెంచింది. ఈ నిర్ణయాలు వ్యాపార సంస్థలపై చట్టపరమైన ఒత్తిడిని తగ్గించి, వ్యాపారం సులభతరం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. పన్ను వసూళ్లకు ప్రాధాన్యత ఇస్తూ, అనవసర క్రిమినల్ చర్యలకు స్వస్తి పలికాయి.

ట్యాక్స్‌పేయర్లకు గుడ్‌న్యూస్.. జీఎస్టీ రూల్స్‌లో సంచలన మార్పులు.. ఇక అరెస్టులకు చెక్!
Major Gst Changes
Balaraju Goud
|

Updated on: Oct 08, 2026 | 5:55 PM

Share

జీఎస్టీ కౌన్సిల్ గురువారం (అక్టోబర్ 08) ఢిల్లీలోని భారత్ మండపంలో ఒక ముఖ్యమైన సమావేశం నిర్వహించింది. ఈ కౌన్సిల్ ఒక కీలకమైన, చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం, జీఎస్టీ కింద ఎటువంటి అరెస్టులు జరగవు. జీఎస్టీ కింద అరెస్టు చేసే అధికారాన్ని కౌన్సిల్ పూర్తిగా తొలగించింది. అలాగే, ప్రాసిక్యూషన్ పరిమితిని రూ. 1 కోటి నుండి రూ. 5 కోట్లకు పెంచింది.

జీఎస్టీ విధానంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక సంస్కరణకు శ్రీకారం చుట్టింది. ఢిల్లీలోని భారత్ మండపంలో గురువారం జరిగిన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పన్ను చెల్లింపుదారులకు సంబంధించిన అమలు, ప్రాసిక్యూషన్ నిబంధనలపై ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా జీఎస్టీ అధికారులకు ఉన్న అరెస్ట్ అధికారాలను తొలగిస్తూ.. కౌన్సిల్ నిర్ణయించింది. దీంతో జీఎస్టీ ఉల్లంఘనలకు సంబంధించి పన్ను అధికారులు నేరుగా అరెస్ట్ చేసే అవకాశం ఇక ఉండదు.

ఇప్పటివరకు తీవ్రమైన పన్ను ఎగవేత, నకిలీ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC) వంటి కొన్ని కేసుల్లో జీఎస్టీ అధికారులు అరెస్ట్ చేసే అధికారం ఉంది. ఈ అధికారాన్ని పరిమితం చేయడం ద్వారా సాధారణ పన్ను వివాదాలు, వ్యాపార సంబంధిత పొరపాట్లు క్రిమినల్ చర్యల స్థాయికి వెళ్లకుండా చూడాలనే ఉద్దేశంతో సంస్కరణలు తీసుకొచ్చింది కేంద్రం. పన్ను బకాయిల వసూలు, వడ్డీ, జరిమానాల విధింపు వంటి ఇతర చర్యలు మాత్రం కొనసాగుతాయి.

అదే సమయంలో జీఎస్టీ కింద ప్రాసిక్యూషన్ ప్రారంభించే పరిమితిని కూడా భారీగా పెంచారు. ఇప్పటివరకు రూ.1 కోటి పన్ను ఎగవేతకు సంబంధించిన కేసుల్లో ప్రాసిక్యూషన్ ప్రారంభించే అవకాశం ఉండగా.. ఇకపై ఆ పరిమితిని రూ.5 కోట్లకు పెంచారు. అంటే రూ.5 కోట్లకు లోబడిన పన్ను ఎగవేత కేసుల్లో క్రిమినల్ ప్రాసిక్యూషన్‌కు వెళ్లే అవకాశం తగ్గనుంది.

ఈ మార్పులను పన్ను వ్యవస్థను మరింత సులభతరం చేయడం, వ్యాపార సంస్థలపై అనవసరమైన చట్టపరమైన ఒత్తిడిని తగ్గించడం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను మెరుగుపరచడం వంటి లక్ష్యాలతో కొత్త సంస్కరణలను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. జీఎస్టీ 2.0లో భాగంగా కేవలం అరెస్ట్, ప్రాసిక్యూషన్ నిబంధనలే కాకుండా.. రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేయడం, ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ వ్యవస్థలో మార్పులు, రిఫండ్లను వేగవంతం చేయడం, వివాదాలను తగ్గించడం వంటి పలు అంశాలపై కూడా కౌన్సిల్ దృష్టి సారించింది.

మొత్తంగా చూస్తే, జీఎస్టీ అమలులో కఠినమైన క్రిమినల్ చర్యల కంటే పన్ను వసూళ్లు, అనుసరణ, సులభమైన వ్యాపార విధానాలకు ప్రాధాన్యం ఇచ్చే దిశగా తాజా నిర్ణయాలు ఉన్నాయని చెప్పొచ్చు. అయితే ఈ మార్పులు పూర్తిగా అమల్లోకి రావడానికి అవసరమైన చట్టపరమైన సవరణలు, తదుపరి ప్రక్రియ కూడా కీలకం కానున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us