Yusuff Ali: లులు చైర్మన్ పెద్ద మనసు.. బ్యాంక్ లోన్ చెల్లించలేని మహిళకు లక్షల్లో సాయం..

|

Oct 16, 2024 | 1:08 PM

ఇంటి కోసం రుణం ఇచ్చిన సంస్థ.. దానిని తిరిగి చెల్లించకపోవడంతో నిర్ధాక్షిణ్యంగా ఓ కుటుంబాన్ని రోడ్డున పడేసింది. ఓ మహిళ తన పిల్లలతో నడిరోడ్డుపై కట్టుబట్టలతో నిలబడిపోయింది. తాళి కట్టిన భర్త తనదారి తాను చూసుకున్నాడు. దిక్కుతోచని స్థితిలో ఆ మహిళ నిశ్చేష్టురాలై ఉండగా.. లులు చైర్మన్ ఆపన్న హస్తం అందించారు. ఆ మహిళకు అండగా నిలబడ్డారు. తన అప్పు మొత్తాన్ని చెల్లించేయడమే కాకుండా.. మహిళ జీవితంలో స్థిరపడేందుకు మరో రూ. 10లక్షలు చేతికిచ్చి ఔదార్యాన్ని చాటుకున్నారు.

Yusuff Ali: లులు చైర్మన్ పెద్ద మనసు.. బ్యాంక్ లోన్ చెల్లించలేని మహిళకు లక్షల్లో సాయం..
Lulu Group Chairman Yusuff Ali
Follow us on

బిలీయనీర్ అయిన లులు గ్రూప్ అధినేత తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఇంటి కోసం చేసిన అప్పును తీర్చలేక రోడ్డుపాలైన ఓ మహిళకు ఆపన్న హస్తం అందించారు. మీడియాలో తన పరిస్థితిని చూసి చలించి తన అప్పు మొత్తాన్ని తీర్చేయడమే కాకుండా.. తిరిగి ఆమె తన జీవితంలో స్థిరపడేందుకు మరో రూ. 10లక్షలు ఆర్థిక సాయం అందించి తన ఉదారతను చాటుకున్నారు. దీనిపై నెట్టింట ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇంతకీ ఎవరా మహిళా? ఆమె అప్పు ఎంత? అంత అప్పు ఎందుకైంది? తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.

ఇంటి కోసం రుణం..

కేరళలోని నార్త్ పరవూర్ కు చెందిన సంధ్య, ఆమె భర్త కలిసి సొంతిల్లు నిర్మించుకునేందుకు ఐదేళ్ల కిందట అంటే 2019లో ఒక ప్రైవేటు సంస్థలో రూ. 4లక్షల రుణం తీసుకున్నారు. ఇంటి నిర్మాణానికి అది సరిపోలేదు. మరింతగా అప్పు చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత రెండేళ్ల పాటు ఈఎంఐలు సక్రమంగానే చెల్లించినా.. ఆ తర్వాత సంధ్య భర్త కుటుంబాన్ని వదిలేసి ఎక్కడికో వెళ్లిపోయాడు. దీంతో కుటుంబ పోషణ, పిల్లల బాధ్యత అప్పు భారం మొత్తం సంధ్యపైనే పడింది. ఓ వస్త్రాల దుకాణంలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తూనే.. లోన్ తీర్చేందుకు ప్రయత్నించింది. అయితే చాలీ జీతం కావడంతో ఆమెకు అది సాధ్యం కాలేదు. సకాలంలో వాయిదాలు చెల్లించలేకపోవడంతో లోన్ మొత్తం వడ్డీతో కలిపి రూ. 8లక్షలైంది. ఈ మొత్తం వెంటనే చెల్లించాలని లోన్ ఇచ్చిన సంస్థ ఒత్తిడి పెంచింది.

ఇల్లు జప్తు..

లోన్ ఇచ్చిన సంస్థ నాలుగు సార్లు సంధ్యను హెచ్చరించినా ఆమె ఏమి చేయలేని పరిస్థితిలో ఉండటంతో ఆ సంస్థ చట్ట పరమైన చర్యలకు ఉపక్రమించింది. ఇటీవల ఆమె పనికి వెళ్లిన తర్వాత రుణం ఇచ్చిన సంస్థ ఆ ఇంటిని స్వాధీనం చేసుకుంది. ఈ విషయం తెలిసిన ఆమె హుటాహుటిన ఇంటికి వచ్చి తన సామాన్లు తీసుకుంటామని అభ్యర్థించినా ఆ ఆర్థిక సంస్థ వారు కనికరించలేదు. దీంతో సంధ్య తన పిల్లలతో కట్టుబట్టలతో నడి రోడ్డుపై నిలబడాల్సి వచ్చింది. ఈ వ్యవహారం అక్కడి స్థానికుల్లో ఆగ్రహాన్ని తెప్పించింది. ఇల్లు జప్తు చేసిన సంస్థపై వారు మండిపడ్డారు. ఈ క్రమంలో దీనికి సంబంధించిన కథనం మీడియాలో కూడా రావడంతో విషయం లులు అధినేత యూసఫ్ అలీ దృష్టికి వెళ్లింది.

మానవత్వంతో స్పందించి..

సంధ్య విషయాన్ని మీడియాలో చూసిన లులు అధినేత యూసఫ్ అలీ స్పందించారు. సంధ్య దయనీయ పరిస్థితిని చూసి చలించిపోయారు. వెంటనే కేరళలోని తన సిబ్బందిని పంపించి, ఆమె రుణ మొత్తాన్ని చెల్లించి, ఆ ఇంటిని తనకు తిరిగి ఇప్పించారు. అంతేకాక మరో రూ. 10లక్షలు ఆమెకు ఆర్థిక సహాయాన్ని అందించి జీవితంలో స్థిరపడాలని సూచించారు. ఓ మహిళ తన పిల్లలతో కట్టుబట్టలతో రోడ్డుపై నిలబడినప్పుడు ఆగ్రహించిన జనాలు, లులు అధినేత ఔదార్యాన్ని చూసి శభాష్ అన కుండా ఉండలేరు. దీనిపై సంధ్య కూడా మీడియాతో మాట్లాడరు. తనకు మరో జీవితాన్ని ఇచ్చిన యూసఫ్ అలీకి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన సాయాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటానని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ కథనం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజనులు సైతం లులు చైర్మన్ చేసిన ప్రశంసనీయమని, తన మానవత్వానికి హ్యాట్సాఫ్ అంటూ అభినందిస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..